Monday, 9 April 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 32 (with Audio)


1-32

శ్లోకం

త్వచ్చైశవం త్రిభువనాద్భుత మి త్యవేహి


మచ్చాపలం చ మమ వా తవ వా ధిగమ్యమ్


త త్కిం కరోమి విరళం మురళీవిలాసి


ముగ్ధం ముఖామ్బుజ ముదీక్షితు మీక్షణాభ్యామ్




ఓ బాలకృష్ణా! నీ పసితనము మూడులోకాలలోని ఆశ్చర్యకరమైన వస్తువులన్నిటికంటే ఆశ్చర్యకరమైనది. చమత్కారకరమైన వస్తువులటికంటే చమత్కారజనకమైనది. అటువంటి నీ మీద నాకు గల ఆసక్తిఎంత తీవ్రమైనదో నీకూ, నాకూ మాత్రమే తెలుసు. మురళీగానపు మాధుర్యానికీ, విలాసాలకీ ఆశ్రయమై తామరపువ్వులలాగా అందంగా ఉండే నీ ముఖశోభని జాగ్రదావస్థలో కాకపోయినా మూర్ఛాస్థితిలోగానీ, స్వప్నావస్థ లోగానీ  దర్శించాలంటే ఏమి చేయాలో చెప్పవలసినది. 

Thursday, 5 April 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 31 (with Audio)


1-31

శ్లోకం


పిచ్ఛావతంసరచనోచితకేశపాశే  పీనస్తనీ నయనపంకజపూజనీయే


చంద్రారవింద విజయోద్యతవక్త్రబిమ్బే  చాపల్యమేతి నయనం తవ శైశవే నః .




ఓ బాలకృష్ణా! నీ రూపమూ, అలంకారమూ ఎంతో సుకుమారం గానూ, మనోహరంగానూ ఉన్నాయి. నీ జుట్టుముడి అందమైన నెమలి పింఛానికి తగినస్థానమే.  నీ రూపం నిండు యవ్వనంలో ఉన్న గోపయువతుల పద్మాల వంటి కన్నులతో పూజింపబడటానికి తగి ఉన్నది.  నీ గుండ్రని ముఖము చంద్రునితోనూ, పద్మాలతోనూ పోటీ పడి గెలుపుసాధించటానికి సమర్ధమై ఉన్నది. బాల్యచాపల్యం ఉట్టి పడే నీ మోహనరూపాన్ని చూడటానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది..

Tuesday, 3 April 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 30 (with Audio)


1-30

శ్లోకం

నిబద్ధమూర్ధాంజలి రేష యాచే    నీరంద్ర దైన్యోన్నతి ముక్తకంఠమ్

దయానిధే! దేవ!భవత్కటాక్ష     దాక్షిణ్యలేశేన సకృ న్నిషించ.

   



ఓ కృష్ణా! ఈ దేహంలో ఉన్న నేను, అనన్యమైన భక్తితో, అణకువతో నా దోసిలికి శిరస్సు చేర్చి, అనంతమైన నీ కటాక్షవీక్షణాలనుండి జాలువారే ఒక చిన్న దయాలేశాన్ని నాపై ప్రసరింపచేసి ఆ అమృతధారలో నన్ను ఒక్కసారైనా తడిపివేయమని  ఎంతో దీనంగా, బిగ్గరగా, నిస్సంకోచంగా అర్ధిస్తున్నాను.

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 29 (with Audio)


1-29

శ్లోకం

మయి ప్రసాదం మధురైః కటాక్షై    ర్వంశీనినాదానుచరై ర్విధేహి

త్వయి ప్రసన్నే కి మిహాపరైర్న     స్త్వ య్యప్రసన్నే కి మిహాపరైర్న.





ఓ గోపాలకృష్ణా! నీ మురళీనాదం వెలువరించే మాధుర్యం కంటే మధురమైన నీ కడగంటిచూపును నావైపు ప్రసరింపచేసి అనుగ్రహించమని వేడుకుంటున్నాను నీ అనుగ్రహం ఆ విధంగా మాకు లభిస్తే ఇంక ఇతర దేవతలతో అవసరం ఏముంది? నువ్వు అలా అనుగ్రహించకపోతే ఇతర దేవతలంతా అనుగ్రహించినా ఉపయోగమేముంది?   

Monday, 2 April 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 28 (With Audio)


1-28

శ్లోకం

అస్తోకస్మితభర మాయతాయతాక్షం

నిశ్శేషస్తనమృదితం వ్రజాంగనాభిః

నిస్సీమస్తబకిత నీలకాన్తిధారం

దృశ్యాసం త్రిభువనసున్దరం మహ స్తే.




ఓ కృష్ణా! ఎప్పుడూ అంతులేని చిరునవ్వుతో కూడి ఉండే నీ దివ్యమైన తేజస్సు  ముల్లోకాలలోని సుందరమైన వస్తువులన్నిటికంటే సుందరమైనది. నీ శరీరపు నీలకాంతి అపరిమితమైన నల్లకలువపూల శోభ లాగా అనంతంగా వ్యాపించి ఉంటుంది. ఈ విధమైన నీ దివ్య సౌందర్యం నిరంతరమూ రేపల్లె లోని యువతుల స్తనముల రాపిడికి గురిఅవుతున్నది. అటువంటి నీ దేహ సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోవాలని నా కోరిక.    

Friday, 30 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 27 (with Audio)


1-27

శ్లోకం

అధీర మాలోకిత మార్ద్రజల్పితం     గతం చ గమ్భీరవిలాసమన్థరమ్

అమన్ద మాలోకిత మాకులోన్మద   స్మితం చ తే నాథ! వదన్తి గోపికాః



ఓ కృష్ణా! రేపల్లెలోని గోపకాంతలు  చంచలములైన నీ చూపుల చక్కదనాన్నీ, లావణ్యాన్నీ, నీ మాటలలోని సరసత్వాన్నీ, నీ నడకలోని సొగసునీ, నీ చిరునవ్వు కలిగించే పారవశ్యాన్నీ గురించి ఎన్నో విధాలుగా చెప్పుకుంటున్నారు. వారిలాగా నేనుకూడా నీ సౌందర్యాన్ని అనుభవించి ఆనందం పొందేటట్లు అనుగ్రహించమని వేడుకుంటున్నాను.

Thursday, 29 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 26 (with Audio)


1-26

శ్లోకం

కదా వా కాలిన్దీ కువలయదళ శ్యామలతరాః

కటాక్షా లక్ష్యన్తే కిమపి కరుణావీచినిచితాః

కదా వా కందర్ప ప్రతిభటజటా చంద్రశిశిరాః  

కమ ప్యన్తస్తోషం దధతిమురళీ  కేళినినదాః





యమునానది లోని కలువ పూరేకులకంటే నల్లగా ఉండి కరుణరసప్రవాహంలాగా వ్యాపించే గుణం కలిగిన శ్రీకృష్ణుని కడగంటి చూపులు నా మీద ఎప్పుడు ప్రసరిస్తాయో కదా?

శ్రీకృష్ణుని మురళి నుండి విలాసంగా వెలువడే మధుర ధ్వనులు  మన్మధవైరి అయిన శివుడు శిరసున ధరించే చంద్రుని లాగా చల్లదనం  కలిగిస్తూ, నా మనస్సుకి ఎప్పుడు ఆనందం కలిగిస్తాయో కదా?