Friday, 30 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 27 (with Audio)


1-27

శ్లోకం

అధీర మాలోకిత మార్ద్రజల్పితం     గతం చ గమ్భీరవిలాసమన్థరమ్

అమన్ద మాలోకిత మాకులోన్మద   స్మితం చ తే నాథ! వదన్తి గోపికాః



ఓ కృష్ణా! రేపల్లెలోని గోపకాంతలు  చంచలములైన నీ చూపుల చక్కదనాన్నీ, లావణ్యాన్నీ, నీ మాటలలోని సరసత్వాన్నీ, నీ నడకలోని సొగసునీ, నీ చిరునవ్వు కలిగించే పారవశ్యాన్నీ గురించి ఎన్నో విధాలుగా చెప్పుకుంటున్నారు. వారిలాగా నేనుకూడా నీ సౌందర్యాన్ని అనుభవించి ఆనందం పొందేటట్లు అనుగ్రహించమని వేడుకుంటున్నాను.

Thursday, 29 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 26 (with Audio)


1-26

శ్లోకం

కదా వా కాలిన్దీ కువలయదళ శ్యామలతరాః

కటాక్షా లక్ష్యన్తే కిమపి కరుణావీచినిచితాః

కదా వా కందర్ప ప్రతిభటజటా చంద్రశిశిరాః  

కమ ప్యన్తస్తోషం దధతిమురళీ  కేళినినదాః





యమునానది లోని కలువ పూరేకులకంటే నల్లగా ఉండి కరుణరసప్రవాహంలాగా వ్యాపించే గుణం కలిగిన శ్రీకృష్ణుని కడగంటి చూపులు నా మీద ఎప్పుడు ప్రసరిస్తాయో కదా?

శ్రీకృష్ణుని మురళి నుండి విలాసంగా వెలువడే మధుర ధ్వనులు  మన్మధవైరి అయిన శివుడు శిరసున ధరించే చంద్రుని లాగా చల్లదనం  కలిగిస్తూ, నా మనస్సుకి ఎప్పుడు ఆనందం కలిగిస్తాయో కదా?

Wednesday, 28 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 22-25 (with Audio)


1-22

శ్లోకం

విచిత్ర పత్రాంకుర శాలిబాలా

స్తనాంతరం యామ వనాంతరం వా

అపాస్య బృందావన పాదలాస్య

ముపాస్య మన్య న్న విలోకయామః



శ్రీకృష్ణునిమీద గాఢాసక్తి ఉన్న ఒక గోపికకి రేపల్లె వీధులలో మృదువైన పాదాలతో లలితంగా నాట్యం చేసే బాలగోపాలుడిపై తప్ప వేరే ఎవ్వరిమీదా అనురాగం కలగటం లేదు. ప్రస్తుతం రేపల్లె వీధులలో కనపడని ఆ గోపాలకృష్ణుని కోసం, అందంగా అలంకరించుకుని యమునానదీ తీరంలోఉన్న ఇసుక తిన్నెల్లో  ఉండే గోపకాంతల స్థనాలమధ్య వెతకాలా? లేక బృందావనంలో ఎక్కడైనా విలాసంగా మురళి వాయించుకుంటూ ఉన్నాడేమోనని వెతకాలా? అనే సందేహంలో మునిగిపోయిందా గోపిక.
  
1-23

శ్లోకం

సార్ధం సమృద్ధై రమృతాయమానై  రాతాయమానై ర్మురళీనినాదైః

మూర్ధాభిషిక్తం మధురాకృతీనాం  బాలం కదా నామ  విలోకయిష్యే


బాలకృష్ణుని మురళీనాదం అమృతంలాగా మధురంగా ఉండి అన్ని దిక్కులకీ వ్యాపిస్తూ ఉంటుంది., సార్వభౌముని కిరీటాన్ని ధరించిన ఆ సర్వశ్రేష్టమైన భగవద్రూప మాధుర్యాన్ని నా కళ్ళతో ఎప్పుడు చూడగలనోకదా!

1-24

శ్లోకం

శిశిరీకురుతే  కదా మనః   శిఖిపింఛాభరణః శిశుర్దృశోః

యుగళం విగళన్మధుద్రవ   స్మితముద్రామృదునా ముఖేందునా.


నెమలిపింఛం సిగలో ఆభరణంగా  ధరించిన ఆ బాలగోపాలుడు తేనెలాగా తియ్యనైన చిరునవ్వులతో నిండిన చంద్రునివంటి తన ముఖాన్ని చూపించి నా కళ్ళనీ మనస్సునీ ఎప్పుడు చల్లబరుస్తాడో కదా!
  
1-25

శ్లోకం

కారుణ్య కర్బుర కటాక్షనిరీక్షణేన

తారుణ్యసంవలిత శైశవ వైభవేన

ఆపుష్ణతా భువన మద్భుత విభ్రమేణ

శ్రీకృష్ణచంద్ర! శిశిరీకురు లోచనం మే .


ఓ కృష్ణా! చంద్రుడిలాగా నువ్వు లోకానికి చల్లదనాన్నీ, లోకుల కళ్ళకి ఆనందాన్నీ కలిగిస్తావు.
దయతో కూడిన నీ చూపులూ, యౌవనం కలిసిన పసిదనంతో నిండిన నీ వైభవమూ, లోకులకి ఆశ్చర్యం కలిగించే నీ విలాసాలూ, నా వైపు ప్రసరింపచేసి నా కళ్ళకి చల్లదనాన్ని కలుగజేయమని ప్రార్ధిస్తున్నాను.

Tuesday, 27 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 19 - 21 (with Audio)


1-19
శ్లోకం
ఆముగ్ధ మర్ధనయనామ్బుజచుమ్బ్యమాన
హర్షాకులవ్రజవధూమధురాననేందోః
ఆరబ్ధవేణురవ మాత్తకిశోరమూర్తే
రావిర్భవంతు మమ చేతసి కేపిభావాః  


బాలగోపాలుని ముఖము చంద్రునిలాగా మధురంగా ఉంది. గోపసుందరీమణులు సగము విప్పారిన పద్మాలలాంటి తమ కళ్ళతో గోపాలకృష్ణుని ముఖపద్మాన్ని ముద్దు పెట్టుకుంటూ ఎంతో సంతోషాన్నీ, కలవరాన్నీ పొందుతున్నారు. బాలగోపాలుని అటువంటి విలాసవిశేషాలు నిరంతరమూ నాకు అనుభవంలోకి రావాలని కోరుకుంటున్నాను.


1-20

శ్లోకం
కలక్వణితకంకణం  కలనిరుద్ధపీతాంబరం
క్లమప్రసృతకున్తలం లలితబర్హభూషం విభోః
పునః ప్రకృతిచాపలంప్రణయినీ భుజాయంత్రితం
మమ స్ఫురతు మానసే మదనకేళిశయ్యోత్థితమ్


రాత్రంతా శృంగారక్రీడలో మునిగిన శ్రీకృష్ణుడు వేకువజామున తన పక్క మీద నుంచి లేస్తూ శరీరంనుండి జారిపోతున్న పీతాంబరాన్ని పట్టుకుంటున్నప్పుడు ఆయన చేతి కంకణాల ధ్వని మధురంగా వినిపిస్తున్నది. అంతకుముందు పడిన శ్రమని సూచిస్తూ  చెదిరి ముడివీడిన  ఆయన ముంగురులలో నెమలిపింఛము బహుసుందరంగా ఉన్నది. తనను వదిలి వెళ్ళవద్దని ప్రియురాలు  అడ్డగిస్తుంటే చంచలుడై చూస్తున్న శ్రీకృష్ణుని ముగ్ధ మనోహరరూపం నా మనస్సులో నిలిచిఉండాలని కోరుతున్నాను.

1-21

శ్లోకం
స్తోకస్తోకనిరుధ్యమాన మృదుల ప్రస్యన్దిమందస్మితం
ప్రేమోద్భేదనిరర్గళప్రసృమర ప్రవ్యక్తరోమోద్గమమ్
శ్రోతుం శ్రోత్రమనోహరం వ్రజవధూ లీలామిథోజల్పితం
మిధ్యాస్వాస ముపాస్మహే భగవతః క్రీడానిమీలద్దృశః   


బాలగోపాలుడు తన శయ్యమీద పడుకుని ఉన్నాడు. దగ్గరలోనే గోపస్త్రీలు ఆయన నిద్ర పోయాడనుకుని ఆయన లీలావిశేషాలు పరస్పరమూ చెప్పుకుంటున్నారు. మెలుకువగానే ఉన్న బాలగోపాలుడు తన గురించి వారు చెప్పుకునే మాటలు వింటూ చిరునవ్వుని ఆపుకుంటున్నాడు. కానీ ఆ స్త్రీల మీద అధిక అనురాగం ఉండటం వల్ల వారి సంభాషణలలోని భావాలకి ఆయన శరీరం గగుర్పాటు చెందుతున్నది. ఆ విధంగా నిద్రనటిస్తూ గోపస్త్రీల సంభాషణలు వింటూ చిరునవ్వు చిందించే బాలగోపాలుడిని నా మనస్సులో ధ్యానిస్తున్నాను.

Wednesday, 21 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 16 - 18 (with Audio)


1-16
శ్లోకం
మణినూపురవాచాలం  వందే తచ్చరణం విభోః
లలితాని యదీయాని లక్ష్మాణి  వ్రజ వీధిషు



రేపల్లెలో బాలగోపాలుడు తిరిగిన అన్ని ప్రదేశాల్లోనూ ఆయన సుకుమారమైన పాదాల గుర్తులు పడుతున్నాయి. ఆయన కాళ్ళకి ఆభరణాలుగా ధరించిన మణులు పొదిగిన అందెలు మధురంగా మోగుతున్నాయి. అటువంటి బాలగోపాలుని పాదాలకి నమస్కరిస్తున్నాను.

1-17
శ్లోకం
మమ చేతసి స్ఫురతు వల్లవీవిభో ర్మణినూపురప్రణయి మంజుశింజితమ్
కమలావనేచర కళిన్దకన్యకా కలహంసకంఠకలకూజితాదృతమ్  



గోపస్త్రీలకు ప్రాణనాయకుడైన ఆ బాలగోపాలుని అందెలధ్వని కాళిందీనదిలో ఉండే కలహంసలు చేసే అస్పష్ట మధురధ్వనులకంటే శ్రావ్యంగా ఉన్నది. ఆ గోపాలుని దర్శనం కాకపోయినా పరవాలేదు. మనోహరమైన ఆయన అందెల ధ్వని నిరంతరం  నా మనస్సుకి ఆనందం కలిగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.

1-18
శ్లోకం
తరుణారుణ కరుణామయ విపులాయత నయనం
కమలాకుచ కలశీభర విపులీకృత పులకమ్
మురళీరవ తరలీకృత మునిమానస నళినం
మమఖేలతు మదచేతసి మధురాధర  మమృతమ్



ఆ బాలగోపాలుని పెదవులు తనలో నిండిఉన్న అమృతత్వ ప్రభావంతో మధురంగా ఉన్నాయి. ఆయన కళ్ళు లేత సూర్యునిలాగా ఎర్రగా ఉండి దయాపూరితాలై విశాలంగా ఉన్నాయి. ఆయన తన కౌగిలింతలతో లక్ష్మీదేవికి గగుర్పాటు కలిగిస్తున్నాడు. మధురమోహనమైన తన మురళీనాదంతో ఆయన మునుల హృదయాలలో ఆర్ద్రత నింపుతున్నాడు. అటువంటి గోపాలకృష్ణుడు ఎల్లప్పుడూ నా హృదయంలో ఆడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను.

కుసుమ


కుసుమ

ఆ రోజు రాత్రి కుసుమకి ఇప్పటికీ గుర్తే.కృష్ణుడితో ఆటపాటలకి మిగతా గోపికలు వెళ్తున్నా స్వతహాగా బిడియపడేదీ , నలుగురితో కలవందీ కాబట్టి కుసుమ ఎప్పుడూ ధైర్యం చేయలేదు. ఎదురింటి నర్మద వొచ్చి కృష్ణుడు ఎంత బాగా వేణువూదాడో,కృష్ణుడు  పక్కన కూచుని ఎట్లా కబుర్లు చెప్పాడో, ఎట్లాంటి చిలిపి పనులు చేశాడో చెబుతూంటే కుసుమకి వెల్దామని ఎంతో ఇదిగా అనిపించినా ధైర్యం చాలలేదు.పక్కింటి నీలవేణీ,మూడో ఇంట్లోకి కొత్తగా కాపరానికొచ్చిన కోడలు,స్వయం ప్రభా స్నానానికనొచ్చి గంటలకొద్దీ కృష్ణుడి మాటలు మాట్లాడుతుంటే తను నోరెళ్ళ బెట్టుకుని వింటోందని  వాళ్ళు ఎగతాళి చేస్తుంటే అల్లాగే నిలబడిపోయిందే గానీ ఏమీ మాట్లాడలేదు  ప్రతి రోజూ రాత్రి దీపాలు పెట్టాక వేణు నాదం వినిపించటమూ తోటి గోపిక లందరూ కృష్ణుడి దగ్గిరికి వెళ్టం చాలా రోజులనుంచీ ఆమె గమనిస్తోందే. రోజూ రాత్రయ్యేటప్పటికి అందరు గోపికలకి అద్భుత ఆనంద రాత్రి,ఆమెకి మట్టుక్కూ కాళరాత్రి. అప్పటిదాకా తను కూడా వెళ్దా మనుకున్నా, వేణువు శబ్దం వినిపించే సరికల్లా ఒక్క సారి మనస్సు ఆనంద తరంగితం కావటమూ,తను వివశ అయ్యి అలా బొమ్మలాగా నిలబడిపోవడమూ, తెల్లవారుఝామున ఊరంతా నిద్ర లేస్తూంటే తెలివి రావటమూ ఇది రోజూ జరుగుతున్న విషయమే.మిగతా గోపికలందరూ కృష్ణుడితో ఆడిన ఆటలూ, పాడిన పాటలూ, చెప్పుకున్న ఊసులూ, చేసుకున్న బాసలూ,చేసిన కొంటె పనులూ,చేద్దామనుకున్న కోణంగి పనులూ,ఇవ్వన్నీ సమయం దొరికినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ, పొద్దున్న కళ్ళాపి జల్లి ముగ్గేసేడప్పుడూ,పాలుపితికేడప్పుడూ,యమునలో స్నానం చేసేటప్పుడూ, పిల్ల్లలకి చల్ది అన్నాలు పెట్టేటప్పుడూ,మొగాళ్ళు పనులమీద బైటికి వెళ్ళీనప్పుడూ,వాళ్ళు మధ్యాన్నం నిద్రపోయేటప్పుడూ,సాయంత్రం దీపాలు పెట్టేటప్పుడూ ఎప్పుడు వీలైతే అప్పుడు గోపికలు వాళ్ళల్లో వాళ్ళే గుంపులుగా కూడో, ఇద్దరు, ముగ్గురుగానో కబుర్లాడుకుంటుంటే, వినీ,వినీ కుసుమకి చెవులు అట్టలు కట్టిపోయాయి. ఉంటానికి ఇల్లు యశోదమ్మ గారి ఇంటిముందే ఉంది. కానీ ఏం లాభం పదేళ్ళ నుంచీ కృష్ణుడు రోజూ పశువుల్ని తోలుకుని ఎప్పుడు వెడతాడో, మళ్ళీ సాయంత్రం తోలుకుని ఎప్పుడు వొస్తాడో అని వేచి,వేచి ఏ కిటికీలోంచో,తలుపుసందులోంచో  దూర దూరంగా చూసిందే  తప్ప, తను దగ్గరినించీ కిష్టయ్యని చూసిన పుణ్యాన పోలేదు.ఒక మాట కూడా మాట్లాడ లేదు. ఏవో దాయాదుల గొడవలతో, ఉంటం పక్కనే అయినా రాక పోకలు పెద్ద లేవు.చూసీ చూసీ ఇల్లా కాదు అనుకుని ఒక నిర్ణయానికొచ్చింది.చూసిన ఒక్క క్షణం లోనే మైమరపించే కన్నయ్యని ఎక్కువ సేపు ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, అని ఆలోచించింది.వాడు త్రిభంగిలో ఉన్నపుడు జగన్మోహనంగా ఉంటాడనీ, అప్పుడు వాణ్ణి ముద్దుపెట్టుకోకుండా ఉండటం అసంభవం అనీ అన్న నీలవేణి మాటలు ఎంత నిజమో చూడాలని ఒక నిర్ణయానికొచ్చింది. ఎల్లాగైనా ఒక సారి యమున ఒడ్డుకి వెళ్ళి కృష్ణుడు మురళి వాయిస్తుంటే వినాలి అని నిశ్చయించుకుంది. పక్కింటి నీలవేణితో మర్నాడు యమునకి స్నానానికెళ్తూ  మనసులోమాట చెప్పింది."నాకు రోజూ రాత్రి ఎందుకో నిద్ర కమ్మేస్తుంది"అని కుసుమ అంటే నీలవేణి "అలానా" అంది.
" మీరందరూ రోజూ రాత్రి యమునా విహారానికి వెళతారటగదా"
 " యమునలో కెళ్తే నీకేంటి,గంగలోదూకితే నీకేంటి"
"అది కాదు...."
" ఏది కాదు"
 " మరి మీరందరూ..."
" "మేమందరం"
"పాట వింటానికి వెళ్తారట కదా"
" ఏపాట , ఎవరు చెప్పారు"
" అంత కోపమెందుకూ, నువ్వూ,ప్రభా మాట్లాడుకుంటున్.."
" మేమేదో మాట్లాడుకుంటుంటే దొంగతనంగా విని ఇట్లా "
"నీకు దణ్ణం పెడతాను, కోప్పడద్దు,కొత్త మీగడ పాలు రెండు చెoబులు పంపిస్తాలే సాయంత్రం, కోప్పడద్దు"
 " సరే నీ కేంకావాలి"
" కృష్ణుడి వేణు గానం ఎలాగైనా ఒక సారి విందామని....అదేం అంత నవ్వు"
" ఆకృష్ణుడు పెద్ద మాయలాడు.మొదట ఏదో అనుకుని వెడతాం, వెళ్ళొచ్చినతరవాత ఇలా ఎలా జరిగిoదని ఆశ్చర్యపోతాం. "
"మాయల మాంత్రికుడా, చూట్టానికి పాపం ఏమీ తెలీనట్టూ .."
 " వంద మాయల మాంత్రికులకంటే మొనగాడు..ఆ చూపులు చూసే అందరూ మోసపోతారు."
"నేనంత తొందరగా మోసపోయే దాన్ని కాదులే"
 "నిన్నొక్క సారి చూశాడంటే చాలు,వాడితో ఒక మాట మాట్లాడితే ఈ ప్రపంచంలో ఇంకేమీ వొద్దనిపిస్తుంది.వాడితో ఒక మాట మాట్టాడితే ,కలిసి నాట్యం చేయకపోతే ఇదేం బతుకు అనిపిస్తుంది,కలిసి నాట్యం చేస్తే,వీణ్ణీ కావిలించుకుని ముద్దెట్టుకోని జన్మం ఏంజన్మం అనిపిస్తుంది"
 " నువ్వు మరీ ఎక్కువ చెబుతున్నావు, నేను మరీ అంత ఇదేమీ కాదులే "
"నువ్వేమీ అంత ఇది కాదు, కానీ వాడు అంత ఇది అని మట్టుక్కు ఖచ్చితంగా చెబుతాను"
"మీరందరూ.."
 "ఆ అదృష్టం రావాలంటే పెట్టిపుట్టాలి. ఉన్న వాళ్ళందర్లోకీ నేనే నాట్యం బాగా చేస్తానని నీకూతెలుసు. కానీ,నాల్రోజులయ్యింది వాడొచ్చి న పక్కన నుంచుని..."
"అదేంటి, ఏడవొద్దు,ఏడవొద్దు..."
"రాత్రి ఎప్పుడౌతుందా అని ఎదురుచూపులూ పిల్లంగోవి పాట వింటూ ఎగురుకుంటూ వెళ్టమూ, వాణ్ణి చూడగానే మైమరచిపోవటమూ, వెన్నెల్లో మాటలూ, పాటలూ,కళ్ళు విప్పి చూసేటప్పటికి పొద్దున కావటమూ, నాల్రోజులైంది ఈ అదృష్టం లేని దేహానికి వాడి చెయ్యితగిలీ "
" నీలవేణీ,ఆగు,ఏడవకు,నువ్వు కాస్త బెట్టు చేస్తే,వీడు కూడా మిగతా మొగాళ్ళలాగాగే నీ చుట్టూ తిరుగుతాడే"
" వాడా"
 "ఏం వీడేమన్న ఆకాశం నించి దిగొచ్చాడా"
 "ఇంకా పైనించేఅనుకో, సరే నిన్ను రాత్రి నిద్దర్లేపి తీసుకెళ్తాను, ఏంచేస్తావో చూస్తాగదా"  
--------------------- 
వెన్నెల పుచ్చపువ్వులాగా వుంది. గాలి సుగంధసుమనోహరమై ఉంది.యమున, సమాధిలో ఉన్న ముని లాగా నిస్తరంగంగా,చంద్ర కాంతి వల్ల ప్రకాశవంతంగా ఉంది.యమున ఒడ్డున ఉన్న కదంబ వనం, మెరిసిపోతున్న బట్టలు కట్టుకునీ,గంధాలూ,కస్తూరీ, అద్దుకునీ,గాజులూ,బావిలీలూ,మణిపద్మాలూ, చంద్రవంకలూ,వంకీలూ,వడ్డాణాలూ,పాపిడిబిళ్ళలూ పెట్ట్టుకుని, రకరకాలుగా జుట్లు దువ్వుకునీ, కృష్ణుడికోసం తయారై వొచ్చిన ఆడవాళ్ళతో కిల్లకిల్లాడుతోంది. "నిన్న నాతో ఎంత చక్కగా కలిసి నాట్యం చేశా"డనీ "నా తో పాడటం కోసమే పుట్టా"డనీ,"వాడికి నేనంటే ఎంతో ప్రాణ"మనీ ఇలా ఎవరికి వారే అనుకుంటుంటే వాళ్ళందరి మధ్యలోంచి నీలవేణి, కుసుమని తీసుకుని  "వారం రోజులైంది నావంక చూసి" అని బాధపడుతున్న ఓ పంకజాక్షి దగ్గరికెళ్ళి ఓదారుస్తుంటే మురళీస్వనం దగ్గిర్లోంచి వినపడింది. కృష్ణుడొచ్చాడంటూ అందరూ కేరింతలు కొడుతూ శబ్దం వినిపించిన వైపు వెళుతూ ఉంటే తను కూడా అటు నడిచింది. అక్కడికి జేరేసరికల్లా చుట్టూ ఆడాళ్ళూ మధ్యలో కృష్ణుడు.వీళ్ళెప్పుడూ మొగవాణ్ణి చూడనట్టు చేస్తున్నారే అనుకుంది మనసులో. పిల్లాడు ఎంత చూడముచ్చటగా ఉంటే మట్టుక్కు ఇంత విడ్డూరం ఏమిటో కదా అనుకుంది. కృష్ణుడు అందరితో కూడి ఆడుతున్నాడు, పాడుతున్నాడు.వెనకవరసలో తనతో పాటు నుంచున్న ధాత్రమ్మ  గారి మరుద్వతి "ఎంత బావున్నాడో అంటే "మీరు మొదటిసారి చూస్తున్నారా "అంది.
"మరీ విడ్డూరం మాటలు చెబుతావు,నేను లక్షోసారి చూడడం కానీ లక్షా ఒకటోసారి చూడాలనుకోవటం"
 "అంత ఏముంది "
 "సరిగ్గా చూస్తే అర్ధమౌతుంది.అదిగో చూడు బుంగ మూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాడో, ఇదిగో క్షణంలో నవ్వులు విరజిమ్ముతూ కొత్త కృష్ణుడు ,నవనవోన్మేషంగా క్షణ క్షణం  ఏదో ఒక కొత్తతనం కనిపిస్తుంది కదా వీడిలో చూడు."
 " అది అంతా మీ ఆలోచనే నేమో"
 "నువ్వు ఇవాళ్ళే వొచ్చావా"
 " అవును"
 " తెలుస్తోందిలే, రెండ్రోజుల తరవాత కలుద్దాం" అని ఆవిడ  వెళ్ళీపోయింది."నిజంగా ఎంత బావున్నాడు వీడు" అని ఒక సారి అనుకుని కుసుమ మళ్ళీ సద్దుకుని, అక్కడ జరిగేదంతా చూస్తోంది.అందరి చూపులూ ఒకళ్ళ వైపే అందరి మాటలూ వాడితోటే, ఇంత మంది ని ఎట్టా లోబర్చుకున్నాడో అని ఆలోచిస్తూ చూస్తూఉంటే నాట్యం ముగిసిపోయింది. గోపికలందరూ ఎంతో కష్టంతో వీడ్కోలు తీసుకుంటుంటే కృష్ణుడు అందరికీ అతిప్రేమతో రేపు మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళుతూ వెళుతూ కుసుమకి పక్కగా వెళ్తూ ఒక్కసారి కుసుమ వైపు తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు                  
ఒక్క క్షణం కుసుమకి గుండె ఆగిపోయినట్టయింది.ఎంత అందమైన నవ్వు,ఎంత మనోహరమైన నవ్వు, ఎంత నిష్కల్మషమైన నవ్వు.ఇట్టాంటి నవ్వు జీవితంలో ఎప్పుడూ చూడలేదే అనుకుంది.ఎంత సుందరంగా నవ్వాడో,విచ్చుకున్న ఎర్రటి పెదాలు ఎలా నవ్వాయో,అల్లరి చేస్తూ ఆ కళ్ళు ఎలా నవ్వాయో ఆలోచిస్తూంటే నీలవేణి వొచ్చి భుజంతట్టి "పద"మంటే ఇద్దరూ కలిసి ఇంటికి జేరారు.స్నానాలప్పుడు కలుద్దామంటూ నీలవేణి వెళ్ళీపోయింది.ఇంటికొచ్చినా ఆ నవ్వే వెంటాడుతోంది.ఎటు చూసినా ఏంచేసినా ఆ నవ్వే గుర్తుకొస్తోంది.గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఆనందం, ఏదో తెలీని అనుభూతి . పాలు పితకటానికి దొడ్లోకి వెళ్తే అక్కడ కూడా అద్భుత మైన ఆ మొహమూ నవ్వే వెంటాడుతుంటే  ఆవు అనుకుని ఎద్దు దగ్గర పాలు పితకటానికి కూర్చుంటే  కాల్తో ఆ ఎద్దు పక్కకి తోసినప్పుడు కానీ తెలివి రాలేదు.పాలు కాస్తూ ఉంటే ఆ నవ్వే వెంటాడితే పాలు కాస్తా పొంగిపోతే అత్తగారు చీవాట్లేసింది.చల్ల చిలుకుతూ ఆ నవ్వు గుర్తుకొస్తే కుండ కాస్తా పగిలిపోయింది.  అతి కష్టం మీద పాలు కాచి చల్ల చిలికి,పెరుగు తోడేసి,లేచేటప్పటికి పొద్దెక్కటం చూసి,త్వరగా స్నానానికి వెళ్ళింది.నీలవేణి ఎవరితోనో పరాచకాలాడుతోంది.కుసుమ వెళ్ళేటప్పటికి వాళ్ళు స్నానం పూర్తి చేసి వెళ్ళిపోయారు." ఏం ఆలస్యమైంది"అంది నీలం.ఒక క్షణం మాట్లాడలేకపోయింది కుసుమ.కళ్లవెంట కన్నీళ్ళు కారుతున్నాయి."ఏమైందే" అని నీలం దగ్గరికి తీసుకుని వీపు మీద సుతారం గా రాసింది."ఏమైందే" అని మళ్ళీ అడిగింది. జవాబు రాకపోయేటప్పటికి "రాత్రి వొచ్చినందుకు బాధా , సరే అయిందేదో అయ్యింది, ఇక ఎప్పుడూ నిన్ను తీసుకు వెళ్ళనులే" అంది నీలం."కాదు కాదు" అంటూ ఖంగారుగా అంది కుసుమ
 "ఏమయ్యిందో సరిగా చెప్పు "అని నీలవేణి అంటే,బేలగా"సాయంత్రం ఎపుడౌతుందే" అంది కుసుమ.
"దేనికే"అని నీలం అడిగితే "కన్నయ్యని చూడాలే " అని బేరు మంది.
"కాసేపాగితే సరి" అన్న నీలం మాటలకి "అప్పటి దాకా ఎట్టాగే" అన్న జవాబొచ్చింది.
" ఏమైందే అసలు ,నిన్ను ఆ కృష్ణుడు ముట్టుకున్నాడా",
" ముట్టుకోలేదు",
" నీతో ఏమన్నా మాట్లాడాడా"
"మాట్టాళ్ళేదు".
"మరి"
 "....."
" ఇలా అయితే నిన్ను సాయంత్రం తీసుకెళ్ళను"
" నన్ను తీసుకెళ్ళకపోతే నా స్వామి ఒంటరివాడైపోడూ, దిగాలు పడిపోడూ"
 "స్వామా, నిన్న మాయల మాంత్రికుడని అన్నట్టు గుర్తు."
"నా స్వామిని అల్లా అనొద్దు."
 " సరే నువ్వు వెళ్ళకపోతే దిగులు పడతాడూ నీ స్వామి"
" అవును"
" నిన్న ఎంతమంది వొచ్చారో చూశావు కాదూ"
" ఎంత మంది వొచ్చినా నెను రాకపోతే స్వామికి క్షణం గడవదు,తెలుసా"
" ఏమయ్యిందే నీకు అసలు" అంటూ నీలవేణి ప్రేమతో దగ్గరికి తీసుకుని లాలించి. బెల్లించితే వెక్కుతూ
" నిన్న వెళ్తూ,వెళ్తూ నన్ను చూసి ఒక్క నవ్వు నవ్వి వెళ్ళిపోయాడే స్వామి,నాకేమన్నట్టని పించిందంటే నువ్వు లేకపోతే నేను ఒంటరి వాణ్ణయిపోతాను కదా,నీకోసమే అసలు ఇక్కడికివొచ్చాను.నువ్వు లేకపోతే నాకెట్లా అన్నట్టని పించిందే. ఆ ఒక్క నవ్వుతో నన్నూ నా మనస్సునీ గెలిచేసుకున్నాడే స్వామి" అని ఆగింది. 
"అప్పటి నుంచీ ఎటు చూసినా ఆ నవ్వు మోమే కనిపిస్తోందే.అప్పటి పులకలు ఇంకా తగ్గలేదు చూడు.ఎంత అందంగా ఉన్నాడే స్వామి.ఎట్టాగైనా ఒక్క సారి వాణ్ణి..."
 "ఊ చెప్పు, వాణ్ణి.."
 "..."
 "చెప్పవే చంపుతున్నావు,చెప్పు"
 " వాణ్ణి..,వాణ్ణి ముద్దెట్టుకోవాలని ఉందే" 
విరగబడినవ్వింది నీలవేణి. తనకి తెలీకుండా ఇంత చిత్రం ఏమొచ్చిందా అని యమునాదేవి తలెత్తి ఓసారి చూసి మళ్ళీ మామూలుగా సాగిపోయింది. "ఎందుకే అట్టా నవ్వుతున్నావు, నన్ను చూసేనా" అంది కుసుమ." ఔనే నిన్ను చూసే. నిన్న ఎన్ని కధలు చెప్పావు,నేనంత,ఇంత అని.వాడు నీతో" " వాడు ఏమిటి వాడు, స్వామి అనొచ్చు కదా చక్కగా" "ఔనౌను  మాట్టాడకుండానే, కలిసి నృత్యగీతాలు సలపకుండానే,కలిసి నవ్వుతూ నౌకా విహారం చెయ్యకుండానే స్వామి అయిపోయాడు కదా వాడు.మరి అవన్నీ అయితే ఏమంటారో తమరు వాణ్ణి." అంది నీలవేణి."నా వాణ్ణి నేను ఏదో అనుకుంటాను , నాఇష్టం" " అబ్బో అక్కడిదాకా వొచ్చిందీ సరె నేవెళతా, కానీ ఒకటి గుర్తుబెట్టుకో, ఆ నల్లనోణ్ణి ముద్దెట్టుకోవాలంటే ఎవరికో, ఎంతో పూజలు చేసీ నోములు నోచిన వాళ్ళకో  గాని భాగ్యం అబ్బదు.గుర్తెట్టుకో,ఇంట్లో పనుంది" అని నీలవేణి బయల్దేరితే కుసుమ కూడా గబగబా స్నానం కానిచ్చి తనతో బయల్దేరింది. నది ఒడ్డున రావి చెట్టు నీడలో గర్గ మహర్షి ." ప్రరబ్రహ్మ తత్త్వం మనస్సుకీ మాటకీ,ఇంద్రియాలకీ,అనుభవానికీ అందనిది" అని పిల్లలకి పాఠాలు చెబుతుంటే నమస్కారం చేసి ఇద్దరూ ఇళ్ళకి వెళ్ళారు.
క్షణమొక యుగంగా రాత్రయ్యింది. కుసుమ, భువనమోహనుణ్ణి చూట్టానికి భువనమోహనంగా తయారైంది.నీలవేణి వాళ్ళ ఇంట్లోకెళ్ళి తనని తయారుచేసి కలిసి వెళ్ళేటప్పటికి,కుసుమ కోరిక లాగాచంద్రుడు కొద్దిగా పైకొచ్చాడు.అందరూ చిన్న గుంపులుగా కూడి మాట్టాడుకుంటున్నారు.ఎంతకీ కృష్ణుడు రావట్లేదు.ఆకు కదిలినా, గాలి వీచినా, యమునలోన గలగలలు రేగినా, దూరమందు సనసన్న పదధ్వని సుంత వినికిడికి తగిలినా, ఒళ్ళు ఝల్లంటుంది,నయనాలు దీర్హమౌతయ్యి,సుకుమారమైన కుసుమ వొళ్ళు ఎర్రగా అయిపోతుంది. కానీ కృష్ణుడురాలేదు.అలా నేలకి వొరిగింది. నీలవేణి వొచ్చి పక్కన కూర్చుని "ఏమయ్యిందే" అంటే" "చూడవే ఎంత బావున్నయ్యో"అని నేలమీద శంఖచక్రాంకితాలైన కృష్ణపాదాల్ని చూబించింది. నిన్న నాట్యం చేస్తూ వ్యత్యస్తపాదుడై నుంచున్నప్పటి ముద్రలు.కిందకి వొంగి ముద్దు పెట్టుకుంది ఆ మట్టి కొంత తీసుకుని నుదుటి మీద తిలకంలాగా పెట్టుకుంది. ఇంతలో మురళీస్వనం మళ్ళీ వినిపించింది. గభాలున లేచి పరిగెత్తింది మిగతా వాళ్ళతో బాటు.
ఎదురుగుండా త్రిజగన్మోహన మూర్తి.గాలి పీల్చుకోడం ఆగిపోయింది.కళ్ళే తప్పితే మిగతా అంగాలేవీ పని చేయట్లేదు. ఆ మూర్తిలోని అమృతాన్ని ఆపకుండా,కళ్ళతోనే తాగేస్తోంది కుసుమ. అతిలోక సుందర మైన పెదాలు విచ్చుకున్నాయి.చిన్న దరహాసరేఖ కనిపించింది. ఎర్రటి లేత పెదాల మధ్య తెల్లటి పళ్ళు కనిపించీ కనిపించనట్టుగా నవ్వు రువ్వాడు.గుండెలనేవి ఇంకా ఎవరికన్నా మిగిలుంటే అవ్వన్నీ ఆగిపోయాయి.కాలం ఆగిపోయింది.యమునలో అలలూ,మలయమారుతమూ,పైన చంద్రుడూ,చుట్టూ కదంబ వనంలోని చెట్లూ అన్నీ ఆ నల్లని చిన్నవాడి మందస్మితానికి దాసోహమయ్యి అలా ఆగిపోయాయి. నల్లనయ్య మెల్లగా ముందరికొచ్చి పక్కపక్కనే ఉన్న నీలవేణీ కుసుమల చేతులు పట్తుకుని నాట్యానికి పిలిచాడు.తనని తాను మరిచి పోయింది కుసుమ . మొదటి సారి దగ్గిరినించి చూస్తున్నాననే ఊహే పులకలురేపెడుతోంది.ఒంటిమీద స్పృహే లేదు కుసుమకి.అత్యద్భుతంగా నాట్యం చెస్తోంది. కృష్ణుడి రెండు చేతులూ పట్టుకుని గిరగిరా తిరుగుతోంది.కృష్ణుడు నడుంచుట్టూ చేతులు వేసి అటూ ఇటూ తిప్పుతుంటే ఆకాశంలో విహరిస్తున్నట్టుంది. ఇంతలో కుసుమ భుజాలు పట్టుకుని కృష్ణుడు దగ్గరికి లాక్కున్నాడు. కృష్ణుడి మొహం దగ్గిరగా కనిపిస్తోంది.అంత అందాన్ని ఒకచోట ఎల్లా పెట్టాడో బ్రహ్మ అనిపించింది. కుసుమ ముఖాన్ని ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు కృష్ణుడు. కృష్ణుడి శరీరం లోంచి చందనమూ, పారిజాతమూ లాంటివన్నీ కలిపిన అత్యద్భుత సువాసన వొచ్చి కుసుమ ఘ్రాణ రంధ్రాల్ల్లోదూరి తన్మయురాలిని చేసింది       
కృష్ణుడి భుజాల మీద చేతులువేసి దగ్గరికి లాక్కుంది కుసుమ.కృష్ణుడు కుసుమ మెడమీద చెయ్యి వేసి ముఖం ముఖం ఆనేంతవరకు తీసుకొచ్చాడు. కుసుమకి స్పృహ లేదు.అన్ని వృత్తులూ ఆగిపొయ్యాయి.నాట్య వేగం హెచ్చింది. కుసుమ ఈ లోకంలో లేదు.కృష్ణుడు ఏదో నవ్వుతూ అంటున్నాడు. కుసుమ తలఊపుతోంది.తన పంచ ప్రాణాలూ తన ఎదురుగ్గా ఉన్న మూర్తిపైనే కేంద్రీ కరించింది.మనస్సూ, బుద్ద్ధ్హీ, పని చేయట్లేదు. నన్ను కృష్ణుడు పట్టుకున్నాడు అనే భావన అంతమై నేనే కృష్ణుణ్ణి అని అనిపించిందొక్కసారి.కళ్ళ ఎదట ఉన్న కృష్ణుడు మాయమై ఒక మహా జ్యోతి లాగా మారిపోయినట్టూ, దానిలో పడి తనూ జ్యోతి లాగా మారి ఆ పెద్ద జ్యోతిలో కలిసి పోయినట్టూ అనిపించింది.
కొంతసేపటికి కుసుమకి తెలివొచ్చింది.నీలవేణితో నాట్యంచేస్తూ ఉన్న కృష్ణుడు కుసుమ వైపు తిరిగి నవ్వాడు. కాసేపటికి నాట్యం అయిపోయింది.అందరూ వెళ్ళిపోయారు.నీలవేణి కుసుమ దగ్గరకొచ్చి"అదృష్టవంతురాలివే, మొత్తానికి ముద్దు పెట్టావు" అంది."నేనా, ఎప్పుడు" అంది కుసుమ." నాట్యం చేస్తూ దగ్గరికి తీసుకున్నాడు కదే," అయితే" "ముఖం ముఖం ఎదురెదురుగా ఉంచాడు కదే" అవును అంతే ముద్దు మట్టుక్కు పెట్టలేదు"." అంతదగ్గరకొచ్చి ఎందుకు పెట్టడు"."నువ్వు చూశావా"." నేను కొద్దిగా దూరంలోనే ఉన్నా, కృష్ణుడు ముద్దు పెట్టాడనే అనిపించింది, అవును, నిజ్జంగా  పెట్టాడు.". "లేదే నాకు ఏమీ ముద్దు పెట్టిన సంగతే గుర్తుకురావట్లేదు"
అవుననీ, కాదనీ వాళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉంటే యమున గలగలా నవ్వింది.చంద్రుడు, ఇంత పిచ్చి పిల్లలేమిటని నవ్వుకుంటూ వెళ్ళీపోయాడు.వనంలో వృక్షాలన్నీ వాళ్ళమీద పూల వాన కురిపించాయి.
ఇంతకీ మీరు చెప్పండి, కుసుమ కృష్ణుడు ముద్దుపెట్టుకున్నారా లేదా.
 
  

వాదర

                                                             వాదర (పెద్ద కధ)

   వసంతకాలం, ఉగాది వెళ్ళి వారం రోజులు కావస్తోంది. పొద్దున్న పదకండయ్యేటప్పటికల్లా ఎండ పొద్దెక్కుతూంది.రాచ కార్యాల మీద సేవకులంతా అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేసేస్తున్నారు. ఠాణేదారు గారి దేవిడీలో రోజూలాగే దొంగతనాలూ, దొమ్మీలూ చేసినవాళ్ళూ వాళ్ళ తరఫు న్యాయవాదులూ, ఊళ్ళోని పెద్దమనుషులతో కిటకిట లాడుతోంది. ఠాణేదారు కచేరీ గదిలో ముగ్గురు పెద్ద మనుషులతో ముచ్చటిస్తున్నాడు. బయట డలాయతు కునికిపాట్లు పడుతూ గది దగ్గర ఏదో అలికిడైనట్టు అయితే చటుక్కున లేచి సర్దుకుని గది దగ్గరికి వొస్తున్న పెద్దమనిషిని చూశాడు. ఆజానుబాహువూ స్ఫురద్రూపీ అయిన మనిషి  ఎవరో రావటం చూసి ఎండ వల్ల కళ్ళు సరిగా ఆనకపోవటంతో చెయ్యడ్డు పెట్టుకుని పరకాయించి చూసి ఇంతకుముందెప్పుడూ చూడలేదని నిరుకు చేసుకుని దగ్గరకు రాగానె పరిశీలనగా చూశాడు. చెయ్యెత్తు మనిషీ దాంతో పాటు విలక్షణమైన గాంభీర్యమూ, ఠీవీ, కుత్తుక తెగే కత్తి వాదర లాంటి సునిశితమైన అతని దృష్టీ, చూసి తొట్రుపడి, అప్రయత్నంగా చేతులు జోడించాడు. "నా పేరు దంతులూరి సుబ్బరాజు,మాది రామచంద్రపురం, కత్తి యుద్ధం గురించి దండోరా విని ఠాణేదారు గారితో మాట్లాడదామని వొచ్చాను" అన్నాడు ఆగంతకుడు.చిత్తం ఇదే వొచ్చానని డలాయతు లోపలికి గబగబా వెళ్ళి వెనక్కి వొచ్చి " రండి స్వామీ" అని వెంటబెట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. ఠాణేదారు, చుట్టూ ఉన్న కుర్చీల్లో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెయ్యి చూపిస్తూ, "రండి". అన్నాడు. సుబ్బరాజు కూర్చున్నాడు.
"చెప్పండి" అన్నాడు ఠాణేదారు.
" కత్తి యుద్ధప్పోటీలో పాల్గొందామని వొచ్చాను" అన్నాడు సుబ్బరాజు శాంతంగా.
"మీరా" అన్నాడు ఠాణేదార్ ఆశ్చర్యంగా .
 "నేనే " అన్నాడు సుబ్బరాజు.
" వయసులోనా--"
"అవును వయసులోనే ఇప్పుడు నాకు అరవై మూడు ఏళ్ళే అయితే ఏమి "
" అరవైమూడు ఏళ్ళకి కత్తిపోటీనా" అంటూ ఠాణేదార్ నవ్వటం మొదలెట్టాడు. చుట్టూ ఉన్న ముగ్గురూ ఆయనతో కలిసి నవ్వటం మొదలెట్టారు. "  సుబ్బరాజుకి రోషం కెళ్ళించింది.తమాయించుకున్నాడు.
"దేశం లో యుద్ధం చేయటానికి మీలాంటి మొలతాడు కట్టిన మొగాడు ఎవడూ ముందుకు రానప్పుడు మన పరువు నిలబడటానికి ఎవరో ఒకరు వొచ్చి ధైర్యంగా నిలబడాలికదా "
-- --- --- --
."కాబూలు నించి ఎవడో కాందిశీకుడు వొచ్చి తగుదునమ్మా అంటూ కత్తి యుద్ధం లో నేనే రారాజు నని గొప్పలకి పోవడమూ మనం నోళ్ళు వెళ్ళబెట్టుకుని వినటమూనూ."
"అది కాదు"
 మహా మహా సుల్తాన్లకీ, మహారాజులకీ దడ పుట్టించి అనేక యుద్ధాల్లో ఆరితేరిన శూరులచేత భళా అనిపించిన తెలుగువాడి కత్తి కూరగాయలు కోయడానికీ పనికిరాకపోవడమూనూ,ఇదేమి మాట, ఎదుటివాడు నేనేగొప్పని పైపైకి రావటమూ, మనం వెనక్కి జారిపోవటమున్నూ,ఇంతకంటే, ఎలాగైనా ఎదురించడానికి ప్రయత్నం చేసి దాంట్లో చచ్చిపోవడం మేలు" అని స్ఫుటంగా చెప్పి కుర్చీలో వెనక్కి జరిగి కూర్చుని మీసం దువ్వుకున్నాడు.
ఠాణేదారుకి మాట దొరకలేదు. అంత  గట్టిగాచెప్పిన సుబ్బరాజు మాటలకి ఠాణేదారు డంగైపోయాడు.చుట్టూ ఉన్న వాళ్ళు అచేతనులే అయ్యారు మెల్లిగా సంభాళించుకుని,"తమరు మధ్యాహ్నం ఒకసారి దివాంజీ గారిదేవిడీకి వొస్తే సావకాశంగా మాట్లాడుకోవచ్చు" అన్నాడు. " అల్లాగే కానివ్వండం"టూ సుబ్బరాజు  లేచాడు.
                    ------------
ఇది జరగటానికి పదిహేను రోజుల క్రితం ఒక గుంపు వొచ్చి ఊరి బయట పోరంబోకు బీడు లో దిగింది. ఆడా  మొగా అంతా కలిపి పాతిక ముప్పై మంది ఉన్నారు. వొచ్చిన రోజునించీ కుస్తీపట్లూ  బరువులెత్తటాలూ, బలప్రదర్శనకోసం తయారీలు జరుగుతుంటే ఊర్లోని సత్తరకాయలందరూ చుట్టూ చేరి వాళ్ళు చేసేవి చూస్తూ "అదిగో వాడి కండలు చూడరా బాబూ ఇదిగో వీడు ఎట్లా మూడు బియ్యంబస్తాల్ని ఎత్తి పడే శాడో చూడరా"అంటూ గప్పాలు కొట్టుకుంటున్నారు. పదిరోజుల తర్వాత బృందం లోంచి అయిదుగురు జమాజెట్టీల్లాంటివాళ్ళు వెళ్ళి రాజ దర్శనం కోరారు. మర్నాడు రాజ దర్శనం చేసి,"జీ హుజూర్" అని ఒకడు ముందుకు వొచ్చి  " మహప్రభూ, మాది గాంధార దేశం, మా జాతి ఖడ్గవిద్య కి ప్రసిద్ధి.దాంట్లో మా నాయకుడు కరీం ఖాన్ మా ప్రాంతం లో అందరినీ ఓడించి బోలెడన్ని బిరుదులూ పతకాలూ పొందాడు.అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ, లక్నో,నాగపూర్, గోల్కొండ సంస్థానాల్లో తన విద్య ప్రదర్శించీ, పోటీకి వొచ్చిన వాళ్ళని వోడించీ, మన్ననలూ సన్మానాలూ పొందాడు.పెద్దాపురం ప్రభువుల ప్రతిభా,రసికతా విని ఇక్కడికి వొచ్చాము ప్రభూ. తమ దర్శనం అయ్యింది, ధన్యులంఇక మా నాయకుడికి ఖడ్గ విద్యా ప్రదర్శన కి అనుమతి ఇయ్యాల్సిందిగా కోరుతున్నాము " అని పక్కకి వొత్తిగిల్లితే వెనకాల నుంచి ఆరున్నర అడుగుల ఎత్తూ, విశాలమైన వక్షమూ, దృఢంగా ఉన్న యోధుడు ముందుకు వొచ్చి " హుజూర్" అంటూ మోకరిల్లాడు. రాజు గారి ఇంగితం గ్రహించి దివాంజీ "సాయంత్రం అయిదు గంటలకి రంగభూమి దగ్గరకి రండి" అని పంపేశాడు. సభలో జరిగిన సంగతి చిలవలై పలవలై ఊరంతా పాకింది.
సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది. రంగభూమి దగ్గర ఇసకేస్తే రాలనంత జనం పోగయ్యారు." సద్దుకుని కూచో"మని అరిచేవాళ్ళూ, నీ కాళ్ళు తగులుతున్నాయి వాటిని దగ్గిరగా పెట్టుకో" అనేవాళ్ళూ,"ఆడోళ్ళున్నారు అట్లా మీద పడితే బాగుండ"దని బెదిరించే వాళ్ళూ, "అల్లదిగో కత్తి వీరుడొచ్చేస్తున్నా"డనీ, "వాడు కాదు, వేరే వాడు వీరు"డనీ వాదోపవాదాలూ, చర్చల మీద చర్చలూ వేడిగా సాగుతున్నయ్యి.  రాజు గారు వొస్తున్నట్టుగా భట్రాజుల కైవారాలు వినిపిస్తున్నాయి. ఠాణేదారూ, డలాయతులూ,వొచ్చి జనాన్ని అంతా సర్ది కూచోబెట్టారు. ముందర సేనాపతీ పక్కన తంగిరాల శంకరప్పా, దివాంజీ  వెంటరాగా నెలవోలు గండాంక,పేషిణి హనుమంత, వత్సవాయి చతుర్భుజ తిమ్మ గజపతి మహారాజులుం గారు సవిలాసంగా సభలోకి విచ్చేశారు. గంట మోగటమే తడవుగా ఠాణేదారు తురక యోధుణ్ణి తీసుకొచ్చాడు.అతనితో పాటు ఒక  అయిదుగురు కూడా లోపలికి వొచ్చి పక్కన నిలబడ్డారు. యోధుడు మహారాజుకీ, దివాంజీకీ, సేనాపతికీ సలాం చేసి తన కత్తి ని తీసుకుని రంగ మధ్యంలోకి వెళ్ళాడు. అదే సమయంలో రాజు గారి అంగరక్షకుడు కొద్దిగా ముందుకు వొచ్చి రాజు గారి పక్కనే నిలబడ్డాడు. ఖాన్ కత్తిని తీసి మళ్ళీ ఒక్క సారి రాజుగారి వైపు తిరిగి, వొంగి సలాం చేసి కింద మట్టిని కొద్దిగా తీసుకుని చేతులకి రుద్దుకుని సింహ నాదం  చేస్తూ కత్తి ని అతి పాటవంగా తిప్పాడు. అట్నించి ఇటూ, ఇట్నించి అటూ ఎగురుతూ ఖడ్గవిద్య లోని మెలుకువలు ప్రదర్సించాడు. ఖాన్ మామూలు యోధుడు కాదనేది పది నిమిషాల్లోనే ఖడ్గవిద్య బాగా తెలిసిన రాజుకీ, సేనానికీ, ప్రేక్షకుల్లో కూచున్న ఇద్దరు ముగ్గురికీ అర్ధమైంది. ఒక అరగంట అలా కత్తి ని ఎన్నివిధాలా వాడొచ్చో చూపెట్టిన తర్వాత ఖాన్ ఒక్క నిమిషం ఆగాడు. ఖాన్ మనుషులు అయిదుగురూ ఖాన్ చుట్టూ వొచ్చి నిలబడ్డారు. వాళ్ళ చేతుల్లో కూడా కత్తులున్నయ్యి. అయిదుగురూ ఒక్కసారి ఖాన్ మీదకి దూకారు. రంగం చకచ్చకితం అయిపోయింది. విచ్చు కత్తుల్లోని విస్ఫులింగాలని చూసి అందరూ అబ్బుర పడ్డారు. జనాలకి ఒళ్ళు తెలీటం లేదు. గాలి పీల్చుకోటం కూడా మర్చి పోయి అంతా బొమ్మలై పోయారు.అయిదుగురు మీద పడి ఎంత ప్రయత్నిచినా ఖాన్ ని ఎవ్వరూ ముట్టుకోలేకపొయ్యారు. పది నిమిషాల తర్వాత అందరూ ఆగారు. చుట్టూ ఉన్న అయిదుగురూ పక్కనే ఉన్న బుట్టల్ని అందుకున్నారు.బుట్టల్లోపచ్చి మామిడి కాయలు పెద్దవే ఉన్నయ్యిమధ్యలో నుంచున్న ఖాన్ మీదకి మామిడి కాయల్ని బుట్టలోంచి తీసి అయిదుగురూ ఒకేసారి వేగంగా విసరసాగారు. ఖాన్ కత్తి తిప్పటం మొదలెట్టాడు. ఒక్క కాయ కూడా ఖాన్ కి తగలట్లేదు. అయిదుగురూ విసిరే వేగం పెంచారు, బాగా పెంచారు ఇంకా పెంచారు. ఖాన్ కత్తి ఇంకా వేగంగా తిప్పుతున్నాడు.పది నిమిషాల తర్వాత కాయలన్నీ అయిపొయ్యాయి. ఖాన్ కత్తి తిప్పటం ఆపి  నిలబడ్డాడు. చుట్టూ ఉన్న అయిదుగురూ ఖాన్ దగ్గరికి వొస్తే అందరూ కలిసి రాజు వైపు తిరిగి వొంగి వొంగి సలాం చేశారు. రాజు ప్రశంసా పూర్వకమైన చూపులు వాళ్ళని ఎంతో ఆనంద పర్చాయి. ఇంతలో ముగ్గురు వారకాంతలు,రాజుగారి బహుమతిని తీసుకుని ఖాన్ దగ్గిరికి వొచ్చారు. ఖాన్ వొంగి వొంగి సలాములు చేస్తూ వాటిల్ని స్వీకరించాడు.
వొచ్చినవాళ్ళు పెద్దగా చప్పట్లు చరుస్తూ ఉంటే "శహభాష్"లూ,"వహ్వా" లూ యెగిరిపోయాయి.ఇందాకటి దాకా నిస్తరంగ సముద్రంలా ఉన్న జనం పోటెత్తిన సంద్రం లాగా అయ్యారు.ఇంతలో ఖాన్ చెయ్యి ఎత్తాడు. అందరూ ఆగారు. ఖాన్ పక్కనున్న వాడు ముందరకొచ్చి " మహా ప్రభూ,పెద్దాపురం సంస్థానం అన్ని కళలకీ, విద్యలకీ  ఆలవాలమైందని అందరూ అంటారు.మెము అనేక సంస్థానాలు తిరిగాము కానీ  మమ్మల్ని ఇప్పటిదాకా ఎవ్వరూ ఓడించలేకపొయ్యారు. మమ్మల్ని ఎవరన్నా ఓడిస్తే మా బిరుదులన్నీ, సన్మానాలన్నీ గెలిచిన వాళ్ళకి సమర్పిస్తాము. మేము గెలిస్తే, మమ్మల్ని ఓడించేవాళ్ళు సంస్థానం లో లేరని ఒక జయపత్రిక ఇవ్వాల్సింది గా మా విన్నపం" అని చెప్పాడు. వింటూన్న రాజుముఖం ఎర్రగా అవటం గ్రహించిన దివాంజీ "ఆలోచిస్తాం" అంటూ లేచిన రాజూ, సేనానీ తో సహా లోపలికి వెళ్ళాడు.                                                                 
సంఘటన జరిగిన్నాటినించీ బీడు చుట్టూ తిరిగే జనాల వరద ని తట్టుకోవటం గుంపు వల్ల కావట్లేదు.వీళ్ళకి ఎన్ని కంకణాలున్నాయ్యో, ఎన్ని సింహతలాటాలున్నయ్యో, అనీ వీళ్ళు ఇంత బలంగా ఉండటానికి ఏమి తింటారో అనీ ఎట్లా సాధన చేస్తారో అని వాళ్ళ చుట్టూ తిరిగే పనీపాటా లేని వాళ్ళ ని తప్పించుకోటానికి గుంపులోని ధృఢకాయులు పగలూ రాత్రీ విచ్చు కత్తులు పట్టుకుని తిరుగుతూ ఉంటే వెళ్ళేవాళ్ళకి గుండెలు పీచు పీచు మనిపించటమూ, దాంతో పాటు ఇద్దరు ముగ్గురికి "తస్య ప్రహరణ మహోత్సవాలు" జరిగేప్పటికి -వెళ్ళేవాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గింది. కానీ ఖాన్ చేసిన సవాలు పెద్దాపురంలోనూ,సంస్థానం లోని అన్ని ఊళ్ళల్లోనూ చర్చనీయాంశమైంది.
----------------------------
అప్పల్రాజు గారో,
చెప్పరా నారిగా,
ఎవరో తురకాడు వొచ్చి కత్తి యుద్దానికి సవాల్ చేశార్టకదా బాబయ్యా ,
  విన్నాను,
చుట్టుపక్కల తమరే కాదూ బాబూ కత్తి తిప్పటం నేర్పేది తమరెల్తున్నారా బాబూ,
 నాకెక్కడ కుదుర్తుందిరాఇవ్వన్నీ వొదిలెళ్ళటానికి,
దేస ప్రెతిష్టా,
 చాలా మంది ఉంటారు కదా పెద్దాపురంలో వాళ్ళు చూసుకుంటారులే,
వారం రోజులయ్యి  వాడొచ్చి సవాల్ చెసి , ఇప్పటిదాకా ఎవరూ రాలెదట,
 నీకెవరు చెప్పారు,
 నిన్న మా మావయ్యొచ్చాడు అక్కడి నించి,
సరే ఫో,
 అంతేనా బాబూ,
పో పో
--------------------
ఏవండీ,
,
వీధిలోని ఆడాళ్ళందరూ మీరు ఆతురకాయనతో యుద్ధానికి వెళ్ళట్లేదని నన్ను కాకుల్లాగా పొడుచుకు తింటున్నారు,
 అలాగా,
 స్వర్గానున్న మీ నాయనగారు,అడవిలో దొంగలెదురు పడితే ఖడ్గ చాతుర్యం చూబించి వాళ్ళందరిని పట్టిస్తే రాజుగారు మెచ్చి ఇచ్చిన ఆస్తి తింటూ ఇప్పుడు వెళ్ళకపోతే ఎట్లా,
నాకు నాన్న అంత రాదులేవే వొదిలెయ్యి,
గెలుపో ఓటమో తర్వాత, ముందర పోటెకి దిగచ్చు కాదూ,
వాడు నిజం కత్తులతోనే యుద్ధం చేస్తాడుట తెలుసా,
అయితే,
నీకు పసుపూ కుంకుమ అక్కర్లేదా ఏంటి,
దేశానికీ, కులానికీ,కుటుంబానికీ అగౌరవం తటస్థించినతరవాత అదొకలెఖ్ఖా ,
 నీ ఇష్టం వొచ్చినట్టనుకో నేను గుడికి వెడుతున్నాను,
వెళ్ళండి,వెళ్ళండి, అట్నుంచటు గాజులేసుకుని కాశీకి కూడా వెళ్ళండి.
ఇన్నేళ్ళనించీ ఏదో వొచ్చినట్టు పదిమందికి ఖడ్గవిద్యలో శిక్షణ ఇవ్వటమూ,ఏదో పెద్ద గురువు నయినట్టు జనాలతో పోచికోలు కబుర్లు.ఇంటికిరాండి మీ పని చెబ్తా.
----------------------------------
 మహారాజ మందిరం లో రాజు ఉయ్యాల ఊగుతూ ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్న దివాంజీ తో ముచ్చటిస్తున్నాడు.
ఏమయ్యింది దివాంజీ,
ఇంకా ఎక్కడనుండీ వార్త రాలేదు ప్రభూ,
పదిరోజులయ్యింది పైవాడెవడో వొచ్చి సవాలు చేసి వాడి కెదురుగ్గా నుంచునేవాళ్ళు ఒక్కళ్ళూ లేరా
,ప్రస్తుతానికి అంతే ప్రభూ,
మళ్ళీ చిట్టా మొత్తం చదవండి,
అల్లాగే ప్రభూ,ప్రధమం సేనాపతి, తనకి సేనలు నడపడంలోనేకానీ ఖడ్గవిద్యలో అంత ప్రావీణ్యం లేదని,
(విసుగ్గా) తర్వాత.
ఉప సేనాపతి అప్పల నరసిం రాజు గారువయస్సు కొద్దిగా మీద పడటం వల్ల,
జీతాభత్యాల్లో.. కానివ్వండి,
దండనాయకులు విక్రమ వర్మ గారు కాశీ యాత్రలో ఉన్నారు ఆయన తిరిగి రావటానికి ఒక మాసం,
తర్వాత,
నగరాధ్యక్షుడు నరసింహ రాజు గారికి అస్వస్థత, దుర్గాధిపతి జగ్గరాజు గారికి వేటలో కొద్దికాలం క్రితం కాలికి తగిలిన దెబ్బ వల్ల,
 హూ ,
యువరాజులుంగారికి ఇంకా విద్యాభ్యాసం కాలేదని మహారాణీ వారి,
  ,
మన రాజ్యంలో ఉన్న వెయ్యిన్నూట పన్నెండు గ్రామాల్లో ఖడ్గ విద్య నేర్పేస్థలాలు పద్ధెనిమిది అందులో పేరున్నవి మూడు,అంతర్వేది, రాజోలు,రామచంద్రాపురం.మూడిట్లోనూ ఉపాధ్యాయులు అరవైదాటినవాళ్ళే , యుద్ధాలవీ కొన్ని తరాలుగ లేకపోవటం వల్ల వొచ్చిన విపత్తు ఇది ప్రభూ.                    
ఇంకెవరన్నా మిగిలారో మరోసారి,
 ప్రభూ,అసలు విషయం ఏమిటంటే ఖాను చూబించిన నేర్పూ,చురుకూ నేనిప్పటిదాకా చూడలేదు.అతనితో తలపడటం మనం మాట్లడుకుంటున్న వాళ్ళ వల్ల ఎంతమాత్రమూ కాదు. అందుకని ఎవ్వరూ ముందుకు ,
 అయితే ఓడిపొయ్యామని జయపత్రిక రాశిద్దామా,
గత్యంతరం కనిపించటంలేదు  ప్రభూ,
 మహారాజుకు చండకోపం వొచ్చింది."ఎవరక్కడ" అన్నాడు,సేవకుడు లోపలికి వొచ్చి చేతులు కట్టుకుని "మహాప్రభూ ఠాణేదారు తమ దర్సనం కోసం వేచి ఉన్నాడు " అన్నాడు. విసుగుతో రాజు సరే అన్నాడు.ఠాణేదారు లోపలికి వొచ్చి వీర నమస్కారం చేసి "ప్రభూ, ఖానుతో కత్తి యుద్ధానికి సిద్ధపడి ఒక ముసలతను వొచ్చాడు ప్రభూ" అన్నాడు .మహారాజు కి ఎక్కడలేనంత ఆనందం వొచ్చింది. మామూలుగా ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడని మహారాజు ఒక్క సారి " ఎవరతను, ఎక్కడి వాడు, అతనికి కత్తి యుద్ధం బాగా వొచ్చునా, ఎక్కడ నేర్చుకున్నాడు" అంటూ పది ప్రశ్నలడిగేసరికి ఠాణెదారు ఖంగుతిన్నాడు. దివాంజీ అందుకుని "ఒక్కనిమిషం మహారాజా" అని ఆగి ఠాణేదారుతో "నీకు తెలిసినవన్నీ చెప్పు" అన్నాడు.వొచ్చినతని పేరు సుబ్బరాజనీ, ఊరు రామచంద్ర పురమనీ, వయసు అరవైమూడేళ్ళనీ వాళ్ళ అబ్బాయి దివాంజీ కొలువులో ఉన్నాడనీ చెబితే ఇద్దరూ విన్నారు.                   
  "ప్రభూ,ఇంతకుముందు వినని పేరు, అరవైమూడేళ్ళు అంటున్నారు, ముందు నేను పిలిచి మాట్లాడి"అంటూన్న దివాంజీ ని చేతితో వారించి ఇప్పుడే ప్రవేశపెట్టండి అన్నాడు రాజు .రాజు ఇంగితం తెలిసి ఠాణేదారు బయటి కెళ్ళి అక్కడ ఉన్న సుబ్బరాజుని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు.దివాంజీ తో మాట్లాడటానికి  సిద్ధ పడి ఉన్న సుబ్బరాజు  క్షణంలో రాజు ముందుకి వొచ్చేటప్పటికి కొంచెం తత్తర పడ్డాడు. సద్దుకుని రాజుకి, వీర నమస్కారం చెసి నిలబడ్డాడు. మహారాజు ఒక సారి సుబ్బరాజుని పరకాయించి చూశాడు.సగం నెరిసిన జుట్టూ, అతి తీక్ష్ణమైన కళ్ళూ,క్షత్రియత్వానికి గుర్తుగా మెలితిరిగిన మీసమూ, కమ్మీల్లాంటి చేతులూ, దృఢమైన శరీరమూ, మొత్తమ్మీద వృద్ధాప్య చాయలుమొదలైన సామాన్య క్షత్రియ కుటుంబీకుణ్ణి చూసి  మహా రాజు ఉదాసీనుడయ్యాడు.
 మహారాజు ముఖంలో మారిన కవళికలు చూసి ఇంగితం గ్రహించి "తమరెవరు" అన్నాడు దివాంజీ.
" నా పేరు దంతులూరి సుబ్బరాజు, మాది రామచంద్రాపురం.మాతాత గారు, దంతులూరి కృష్ణం రాజు గారు ప్రభువ్వారి ముత్తాత గారి వద్ద దండ నాయకుడిగా ఉండి అనేక యుద్ధాల్లో  పాల్గొన్నారు.మా చిరంజీవి వెంకట్రాజు తమ దేవిడీలో పని చేస్తున్నారు ప్రభూ. కత్తి పోటీకి సవాలు చేసిన కరీం ఖాన్ తో ఎవరూ యుద్ధం చేయటానికి రాలేదంటే పాల్గొనటానికి వొచ్చాను ప్రభూ" అన్నాడు సుబ్బరాజు.
"పోటీలో పాల్గొనటానికి మీకు కత్తి తిప్పటం బాగా వచ్చా"
" పోటీల్లో పాల్గొంటానికి అత్యంత అవసరమైన గుండె ధైర్యం ఉంది ప్రభూ"
 "ధైర్యమొకటే కాదు,శక్తీ,కత్తి తిప్పటం లో నేర్పూ కూడా కావాలి"
" పులిపిల్లకి వేటాడడం ఎవరు నేర్పుతారు ప్రభూ,క్షత్రియుడికి ఎవరన్నా కత్తి తిప్పటం నేర్పాలా ప్రభూ,అన్నిట్నీ మించి అవసరం అందరికీ అన్నీ నేర్పిస్తుంది ప్రభూ"
"అవతల ఖడ్గవిద్యా దురంధరుడు, ప్రాణాలకే ప్రమాదమన్నది తెలుసా" అన్న దివాంజీ గొంతులో కొంత సానుభూతి పలికింది
." ప్రాణాలకి వెరిచి, ఎవరో వొచ్చి పోటీకి పిలిచినప్పుడు వెళ్ళకపోతే, దేశ ప్రతిష్ట యేమవుతుందిప్రభూ "
 "కత్తి తిప్పటం సరిగ్గా రాని వాళ్ళని పోటీకి దింపితే రసాభాస కాదూ"
 "అసలు పోటీకి ఎవరూ దిగకుండా జయపత్రిక ఇస్తే అయ్యే అపఖ్యాతి కంటే ఇదే సబబైనదని తలుస్తాను ప్రభూ"
 ఇట్లా దివాంజీ సుబ్బరాజు వాక్చమత్కృతి చూబించుకుంటూఉంటే మహారాజు కి నచ్చలేదు. అసలే ఎవరూ పోటీకి దొరకలేదనే బాధ, దొరికినతను ముసలాడనీ, కత్తి తిప్పటం సరిగ్గా రాదేమోఅనే వ్యధతో మహారాజు విసుగ్గా సుబ్బరాజుని సూటి ప్రశ్న అడిగాడు
." మీరు ఖడ్గ విద్య ఎక్కడ, ఎన్నేళ్ళు,నేర్చుకున్నారు" .
మహారాజు అంత సూటిగా అడిగేటప్పటికి సుబ్బరాజు ఒక్క క్షణం తొట్రుపడి సంబాళించుకుని" ప్రభూ,నా విద్య గురించి ఎవరికీ చెప్పననీ, అనవసర విద్యా ప్రదర్శనలు చేయననీ, అత్యవసర సమయాల్లోనే విద్యని ఉపయోగిస్తాననీ నాదగ్గిర  గురువుగారు మాట తీసుకున్నారు ప్రభూ.అందువల్ల ఏమీ చెప్పలేను ప్రభూ." మహారాజుకి ఏమి చెయ్యాలో తెలియలేదు.
"మీకు కత్తి తిప్పటం వొచ్చని నమ్మి ఎలా పోటీకి పంపటం" అన్నాడు మహారాజు
 "నేను పోటీకి వెళ్ళటం ప్రధానం కాదు ప్రభూ,మనదేశ ప్రతిష్ట నిలబెట్టటానికి ఎవరో ఒకరు నిలబడాలి అని నా అభిప్రాయం ప్రభూ. ఎవరూ సిద్ధంగా లేకపోతే, నాకు అవకాశమిమ్మని అభ్యర్ధిస్తున్నాను." అని సుబ్బరాజు కొద్దిగా వెనక్కి తగ్గాడు.
మహారాజు ఇంగితం గ్రహించి దివాంజీ" ఆలోచించి కభురు చేస్తా"మంటే "అలాగే మహా ప్రభూ" అంటూ సుబ్బరాజు వినయంగా నమస్కారం చేసి బయటికి వొచ్చాడు.
దివాంజీ ఏమిటిది" " మహారాజా,నేను గమనించి నంతవరకూ ఇతను చాలా నిబ్బరమూ గుండె దిటవూ ఉన్న వాడు.నాతోనే కాదు తమతో మాట్లాడుతూ ఉన్నంతసేపూ ఎక్కడ జంకలేదు.భయపడలేదు.ఆలోచిస్తే ఇతను చూట్టానికి మామూలు వాడిలాగా కనిపించినా ఎదో మనకి తెలియని మర్మమేదో ఉందని అనిపిస్తోంది ప్రభూ. మన వేగుల్ని పంపితే సమస్త వార్తలూ ఇట్టే తెలుసుకోవచ్చు" అని మాట్లాడుతున్నంతసేపూ మహారాజు ముఖం లో భావం వెతికిన దివాంజీకి ఏమీ తెలియలేదు. మహారాజు లేస్తూ "రేప్పొద్దునకల్లా" అంటే" అల్లాగే ప్రభూ" అని దివాంజీ నిష్క్రమించాడు.
-----------------
దివాంజీ మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఠాణేదారుతో కూర్చుని వేగుల వాళ్ళు తెచ్చిన విషయాల్ని ముచ్చటిస్తున్నాడు. "అయితే వొచ్చిన వార్తల ప్రకారం, సుబ్బరాజు భీమవరంలో పుట్టాడు.చిన్నతనంలో పెద్దగా చదువుకోకుండా తండ్రికి తోడుగా వ్యవసాయంలో తిరిగాడు.పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత ముప్ఫయ్యో ఏట ఇల్లొదిలి దేశాలు పట్టి పోయి పన్నెండేళ్ళ తరవాత తిరిగొచ్చి మళ్ళీ అప్పటినించీ వ్యవసాయం చేసుకుంటున్నాడుమళ్ళీ వెనక్కి తిరిగొచ్చిన దగ్గిరినించీ రోజుకోసారి ఊర్లోవాళ్ళ పొలాలన్నీ వడివడిగా చుట్టొస్తాడనీ,తెల్లారకుండా ఇంట్లో ఎవో ఆసనాలూ అవీ వేస్తాడనీ, ఇంతేనా. దీన్ని ప్రభువులకెట్లా నివేదించేది."
" అంతే కాదు దివాంజీ, మూడేళ్ళ క్రితం ఈయన అత్తగారి ఊరికి ఏదో పెళ్ళికి వెళ్ళినప్పుడు  దొంగల దండు ఊరిమీద పడితే, కర్రసాము చేసి వాళ్ళందరినీ తరిమేశాడని కబురు".
"ఇంకా"
"ఇంకేమీ లేవు దివాంజీ"
"ఇం కొంత మంది వేగుల్ని పంపించు. పూర్తి వివరాలు పొద్దునకల్లా కావాలి".
ఠాణేదార్ వెళ్ళిన తరవాత సేవకుడు వొచ్చి " ప్రభూ, వెంకట్రాజు వేచి ఉన్నాడు " అంటే కొద్దిగా ఆలోచించి ఒక నశ్యం పట్టు పట్టి తలఊపాడు దివాంజీ.
"రా వెంకట్రాజూ కూర్చో" అని దివాంజీ చెయ్యి చూపిస్తే, తనతో ఇప్పటిదాకా ఎప్పుడూ మాట్టాడని దివాంజీ ఎందుకు ఉన్న పళంగా పిలిపించారో అనుకుంటూ కూర్చున్నాడు. "ఇప్పటిదాకా నీతో మాట్టాడడం కుదరనేలేదు. నీ గురించి మొత్తం తెలుసుకుంటే నిన్ను సరైన పనికి నియోగించొచ్చని ఆలోచించి పిలిపించాను" అన్నాడు దివాన్.
గొంతు సవరించుకుని " నాపేరు దంతులూరి వెంకట్రాజు ప్రభూ. మాది రామచంద్రాపురం. మా ఊళ్ళోనే సోమయారాధ్యుల వద్ద గణితమూ,రాజాస్థాన పద్ధతీ, నేర్చుకున్నాను ప్రభూ. వెంకటేశ్వర శర్మ గారి వద్ద కొంత అర్ధ శాస్త్రమూ,కొంత దండనీతీ చదివాను. తెలుగులో పంచకావ్యాలూ, సంస్కృతంలో కాళిదాసూ,మాఘుడూ అయినారు ప్రభూ. కులోచితమైన ఖడ్గవిద్య మా నాన్న గారి దగ్గర కొంత అభ్యసించాను"
 "మీ నాన్నగారు..."
 "మా నాన్నగారు, దంతులూరి సుబ్బరాజు గారు ఊళ్ళోనే ఉంటూ యోగశాస్త్రంలో బాగా కృషి చేసి రోజూ రెండుసార్లు గంటకి పైన ఆసనాలు వేస్తుంటారు. ఊళ్ళో కుర్రాళ్ళు కొంత మంది వొచ్చి కర్ర తిప్పటం నేర్చుకుంటారు.ఎవరికన్నా ఒంట్లో బావుండకపోతే వెళ్ళి చూసి, యోగాసనాలు వేయించటమూ, లేకపోతే మర్దనలు ఎలా చెయ్యాలో చెప్పి చేయించటమూ చేస్తుంటారు ప్రభూ".
"కత్తి తిప్పటంలో.."
" కత్తి తిప్పటం ప్రాణాలకి అపాయం కలిగించేది కాబట్టి  దానికి శిక్షణ కష్టంగానూ,నియమాలూ కఠినంగానూ అమలుపరిచేవారు. అందుకనే జేరినవారందరూ కొద్ది కొద్ది గా నేర్చుకుని వొదిలేసి వెళ్ళీపొయ్యేవాళ్ళు."
." ఏమి కారణం, ఆయనకి సరిగా రాదా"
 " ఆయనకి కత్తియుద్ధాన్ని ఎవరికి పడితే వారికి నేర్పడానికి ఇష్టం వుండేది కాదు.అది కావాలంటే, మనస్సు మీదా దేహం మీదా పూర్తి పట్టు ఉండాలని ఆయన చెప్పేవాళ్ళు .ఎవరన్నా దాడికి వొస్తే  నన్ను నేను తట్టుకోవటానికి పనికొచ్చేంతవరకే శిక్షణ ఇచ్చారు "
. "అదేమి"
." మా అమ్మగారికి కత్తి యుద్ధం అంటే ఇష్టం లేదు.ఆయన నాకు ఆరేళ్ళప్పుడు ఇల్లొదిలి వెళ్ళి పది సంవత్సరాల తర్వాత తిరిగొచ్చారు. ఆయన తిరిగి వొచ్చేటప్పటికి నేను గణిత పాఠ శాలలో ప్రవేశించి అయిదేళ్లయింది.అందుకని నేనుఅటు వైపు వ్యాసంగం చెయ్యలేదు.యోగాసనాలూ,కర్రా, కత్తి తిప్పటాలూ, మర్దనలు చేయించటాలూ ఇవ్వన్నీ ఆయన అప్పుడు నేర్చుకున్న విద్యలే, అంతకు ముందు లేవు ప్రభూ. ."

" ఎక్కడికెళ్ళారో, ఏమినేర్చుకున్నారో.."
" అవి ఎవ్వరడిగినా ఆయన చెప్పలేదు ప్రభూ."
 "కారణం"
 " గురువుకిచ్చిన మాట అని ఒక సారి అంటుండగా విన్నాను"
" మన విజయ వర్మ గారి ఖడ్గవిద్యా ప్రావీణ్యం చూసేఉంటావు "
" అవును ప్రభూ"
" అంత బాగా తిప్పుతారా మీ నాన్నగారు"
" ఆయన నన్ను నేను తట్టుకోనే మేళకువలే నాకు నేర్పారు ప్రభూ "
 " ఆయనకి వర్మ గారికంటే బాగా వొచ్చునని మీ అభిప్రాయమా"
 "ఎప్పుడూ చూడని దాని గురించి అభిప్రాయం ఎలా చెప్పగలగటం ప్రభూ"
."మీ నాయన గారు రాజ దర్శనం చేసి కరీం ఖాన్ తో పోటీకి తాను సిద్ధం అని చెప్పారు"
" నిజంగానా ప్రభూ.. ఆశ్చర్యంగా వుంది"
"పోటీ అంటే ప్రాణాలకి పరీక్ష, తెలుసా"         
 "తెలుసు"
" కరీం ఖాన్ తెలుసా"
 "తెలుసు ప్రభూ"
"మరి ఆయనకున్న ధైర్యం"
 " తెలీదు కానీ ఏదో ఉండే ఉంటుంది ప్రభూ"
."ఆయనకి ఖడ్గవిద్య అంత తెలుసా"
 " నాకు ఆయనకి ఎంతవొచ్చో తెలీదు కానీ ఒక్కటి మట్టుక్కు తెలుసు, ఆయన ఏదన్నా అనుకుంటే సాధించి తీరతారని.మహా మొండి మనిషి,ఎవరి మాటా వినరు.చెయ్యదల్చుకుంది చేసితీరతారు. నా విషయం ఒక్కట్లోనే ఆయన అనుకున్నది కాలేదు.నన్ను ఎలాగైనా సైన్యం లో చేర్పించాలని ఆయన పట్టు,కానీ మా అమ్మగారి అభీష్టం మేర నేను మీ కచేరీలో చేరాను"
" మంచిపని చేశావు, మళ్ళీ కలుద్దా"మని దివాంజీ అంటే వెంకట్రాజు లేచి నమస్కారం చేసి వెళ్ళీపోయాడు.
"ఠాణేదార్,ఇందులో ఎదో మర్మమున్నట్టుంది"
" అవును దివాంజీ"
" ఇంతకీ సుబ్బరాజుకి ఏమన్నా వొచ్చా లేదా"
" కనుక్కోవాలంటే ఒక్కటే మార్గం దివాంజీ"
"ఏమిటి"
" రేపు పొద్దున్నే సుబ్బరాజు లేచి గోదావరి ఒడ్డుకి వెళ్ళేప్పుడు మన సైనికులు ఇద్దరికి కత్తులిచ్చి పంపుదాం.సుబ్బరాజుకి కూడా కత్తి దొరికేట్టు చేద్దాం. దాంతో అసలు సంగతి తేలుతుంది."
" బావుంది. పంపించేది మంచి వాళ్ళని పంపు"
" అల్లాగే దివాంజీ"
"రేప్పొద్దున్నే వొచ్చి విషయం చెప్పు"
 "సరే "అని నమస్కారం చేసి ఠాణేదారు బయల్దేరాడు.     
   --------------------        
పెద్దాపురం లో సుబ్బరాజు ఇంట్లో భోజనానంతరం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఇంతలో ఆయన సతీమణి తాంబూలం తీసుకొచ్చి అందిస్తూ మెల్లిగా .

"ఏవండీ, ,మీరేదో కత్తి పోటీలకెళ్తున్నార్ట".
","
 "మీకేమన్నా అయితే హూ.. హూ.".,
"నాకేమవుతుంది?.అయినా అనవసరమైన  ఇల్లాంటి విషయాలు నీకెవడు చెప్పాడు. నిండు వాకిల్లో పొద్దుపోయాక ఏడవడం ఒఖటి.".
 "అబ్బాయి చెప్పాడు."
 "పిలు వాణ్ణి,ఒరే వెంకట్రాజూ ",
వెంకటరాజు భయపడుతూ మెల్లిగా వొచ్చి తలవంచుకుని "నాన్నగారూ , చెప్పండి." అన్నాడు
 "మీ అమ్మకేంచెప్పావురా ఏడుస్తోంది".
"రాజుగారి దగ్గిరికెళ్ళి కరీం ఖాన్ తో కత్తి యుద్ధం నిజమైన కత్తుల్తో" ...,
 "సరే అయితే ఏమిటిట".
"మీ ప్రాణానికి ప్రమాదమని అమ్మ"..,
 "మీ అమ్మని ముందరికెందుకు తోస్తావు,నువ్వే అడగొచ్చుగా.అవును నేను పోటీలో పాల్గొంటాను.మన కులంలోపుట్టి నీలాగా కాగితాలు ఖరాబు చేసే పనులు చేసే కంటే ధైర్యంగా వెళ్ళి సవాల్ చేసిన వాడితో తలపడటం మెరుగ్గాదా."
"మీకేమన్నా అవుతుందేమోనని"..
 "అయితే అవుతుంది,కాకపోతే కాదు.నువ్వేమన్నా దేవుడివా లేకపోతే కలగన్నావా.వాడికెందుకు కాకూడదూ".
 "మీకు పోటీచేసేంత  కత్తి యుద్ధం రాదేమోనని".
."అప్రాచ్యపు వెధవా, తండ్రినే ప్రశ్నిస్తావూ , నాకేమి వొచ్చో రావో నువ్వు తేలుస్తావూ,ఫో అవతలకి.ఫో"
అని సుబ్బరాజు మేడమీద గదిలోకి వెళ్ళిపోయాడు. వెంకట్రాజు తల్లిని కూచోబెట్టి సముదాయించాడు.                 
    మర్నాడు పొద్దున యధాప్రకారం నిద్దరలేచి సుబ్బరాజు గోదారి గట్టుకి బయల్దేరాడు. చేతి కర్రా,ఖాళీ గిన్నాచెరో చేతిలో తీసుకుని, వెళ్తూ వెళ్తూ వేపపుల్ల కోసి నోట్టో పెట్టుకుని నములుతూ దంతధావనం కార్యక్రమాలు  పూర్తికానిచ్చి స్నానానికి గోదారికి జేరబోతుంటే తుప్పల్లోంచి ఇద్దరు దొంగలవేషంలో ఉన్న వాళ్ళు వొచ్చి "కదలకు, కదిల్తే చంపేస్తా"మని అరిచారు.సుబ్బరాజు పరకాయించి ఇద్దరికేసీ చూశాడు.చేతిలో కత్తులూ ముఖానికి ముసుగులూ, దారి పక్కనే అందుబాటులో పెట్టిన కత్తినీ చూసి, నవ్వి, అడ్దుతప్పుకోండని సైగ చేసి ముందరి కెళ్ళబోయాడు.వాళ్ళిద్దరూ కత్తులతో ఒక్కసారి ముందుకి ఉరికారు.సుబ్బరాజు పక్కకితప్పించుకుని కర్రతో మొదటివాడి భుజం మీద కొడితే గూడు జారినట్టయి వాడు చెయ్యి కదల్పలేకపోయాడు. పక్కకి తిరిగి, ముందుకొస్తున్న రెండో వాడి కాలుకి కర్ర అడ్డంపెట్టి వాడు పడిపోగానే వాడి మీదకి దూకి వాడి చేతిలో కత్తి లాక్కుని నిల్చున్నాడు. "గోదారి ఒడ్డునుండే దొంగలు కత్తులు తీసుకుని దొంగతనానికి రారని దివాంజీ గారికీ ఠాణేదార్ గారికి చెప్పండి" అని సుబ్బరాజు వెళ్ళిపోయాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న ఠాణేదారు అట్నించటే దివాంజీ ఇంటి దారి పట్టాడు
 జరిగిందంతా మహారాజుకి పూసగుచ్చినట్టు నివేదించాడు దివాంజీ." యేమి చేద్దామండీ" అని అడిగిన రాజుకి " సుబ్బరాజుకి తనమీద తనకి ఉన్న నమ్మకం నాకు కూడా కొంతవరకు నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇవాళ్ళ పొద్దున గోదావరి ఒడ్దున జరిగింది చూస్తే ఇతను ఎదుర్కోగలడు అని అనిపిస్తోంది ప్రభూ.అదీకాక ఇంకెవ్వరూ ముందుకు రాలేదు అందువల్ల మనకి రెండే మార్గాలున్నయ్యి. ఒకటి జయపత్రిక రాసివ్వటం,రెండోది,సుబ్బరాజుని పోటీలోకి దింపటం.ఇంతకుముందేమోగానీ, ఇప్పుడు నాకు రెండోదే సరైనదనిపిస్తోంది ప్రభూ" అన్నాడు దివాంజీ "సరే మీ ఇష్టం" అని మహారాజు మిగతా రాచ కార్యాల మాటల్లో పడ్డాడు.
"చైత్ర మాసం పున్నమ నాడు సాయంత్రం రంగ భూమి లో కాబూలు వాస్తవ్యుడు కరీం ఖానుకీ రామచంద్రాపురం వాస్తవ్యుడు సుబ్బరాజుకీ కత్తిపోటీ అన్న దండోరా విని అందరూ అవాక్కయ్యారు
 రామచంద్రాపురం లో ఉన్న వాళ్ళకయితే మాటలే రాలేదు. "మన సుబ్బరాజేనా లేక ఊళ్ళో వేరే ఇంకో సుబ్బరాజు ఇంకెవరన్నా ఉన్నారా" అనీ,"ముసలాడికి పిచ్చి ఎక్కినట్టున్న"దనీ ఇంకా పలురకాలుగా జనాలు చెప్పుకోటం మొదలెట్టారు.ఊళ్ళో ఉన్న వాళ్ళల్లో ఆయనకి అత్యంత ఆప్తుడు శంభు శాస్త్రి దగ్గరకొచ్చి అందరూ ఆరాలు తీస్తుంటే నిజం కనుక్కుందామని శంభు శాస్త్రి పెద్దాపురం వొచ్చి వెంకట్రాజు ఇంటికొచ్చాడు.ఆయన్ని చూడంగానే సుబ్బరాజు
"ఏరా బావా, నిన్ను కూడా మా  తలకుమాసిన వాడు పిలిపించాడా" అని అడిగాడు.
 "లేదే, దేనికి" అన్నాడు శాస్త్రి."
 "పదిరోజులనించీ మొలతాడు కట్టిన ప్రతి అడ్డమైన వెధవనీ మా వాడు పిలవడం,వాడొచ్చి పోటీలోకి వెళ్ళద్దని వాగటం నాచేత తిట్టించుకోవటం, ఇంతే."
 "నిజంగా నువ్వు పోటీలోకి దిగావా అని కనుక్కుందామని వొచ్చానురా. నీకేంట్రా బావా, నిన్ను జయించే వాడు పృధివి మీద పుట్టలేదురా. అదీ ఇప్పుడు నీకు గురువు ఉచ్చలో ఉన్నాడు.అన్నిటా నీకే జయం.సూక్ష్మ బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇది చెప్పిపోదామనే వొచ్చాను" అని మెట్లు దిగాడు శాస్త్రి.
-----------------------
పోటీ అని దండోరా వేసినదగ్గరినించీ ఖాన్ గుంపువాళ్ళ విడిదిలో  హడావిడి పెరిగింది. అప్పటిదాకా రహస్యంగా సాగిన ఖాన్ వ్యవహారం అప్పటినించీ అందరి ముందూ సాగింది. ఖాన్ ఎట్లా కత్తిని తిప్పుతున్నాడు, ఎన్ని పాలూ, ఎన్ని గుడ్లు, ఎంత మాంసం తింటాడు, ఎంతసేపు శ్రమ చేస్తాడు అన్నవి మొదటి రోజే పెద్దాపురం మొత్తం తెలిసిపోయాయి. రెండోరోజు,పెద్దాపురంలోనినాలుగు ఖడ్గవిద్యా పాఠశాలలకి వొచ్చి చూడాల్సిందిగా వినతి పత్రం అందింది.పొరపాటున వెళ్ళిన ఇద్దరు పాఠశాలల అధ్యాపకులకి ఖాన్ కెదురుగా కొద్దిసేపు నుంచోమనే విన్నపమూ, నుంచున్న కొద్ది సేపట్లోనే వాళ్ళ ప్రతిభ ఎంతో ఖాన్ ప్రతిభ ఎంతో స్పష్టంగా జనాలందరికీ అర్ధమయ్యేది. ఇట్లా నాలుగు రోజులయ్యేటప్పటికి ఖాన్ తప్పకుండా గెలుస్తాడనే నమ్మకం అన్ని వర్గాల ప్రజల్లోనూ బలిసింది. మరుసటి రోజు ఖాన్ ఏమిచేస్తున్నాడో అని వెళ్ళిన వాళ్ళకి ఖాన్ తరఫు మనిషి వొచ్చి " అయ్యలారా,ఒక పందెం కాయటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పందెం ఏమిటంటే ఒక విచ్చు రూపాయ ఇచ్చిన వాళ్ళకి అయిదు నిమ్మకాయలు ఇస్తాము. వాటితో ఒక్క దాంతో నయినా ఖాన్ సాబ్ కత్తి తిప్పేటప్పుడు ఆయన్ని కొట్టాలి.కొట్టినవాళ్ళకి కాయకి అయిదు రూపాయలిస్తాము. కొట్టేవాళ్ళు  ఒక్కొక్కళ్ళు గా గానీ, గుంపుగా కానీ కొట్టొచ్చు" అని చెప్తే గంటలో సగం పెద్దాపురం అక్కడ ప్రత్యక్షమైంది. జనాలందరినించీ వసూలు చేసిన రెండొందల రూపాయల్ని మూట కట్టుకుని అందరికీ నిమ్మపళ్ళు పంచి వెళ్ళి చుట్టూ తాడు కట్టిన రంగభూమికి ఒక పక్కన కూర్చున్నాడు కుర్రాడూ. కొద్ది సేపటి తర్వాత కరీంఖాన్ వొచ్చి మధ్యలో నుంచుంటే జనాలు గుంపులుగా తాడు చుట్టూ పోగయ్యారు. ఖాన్ కత్తి తిప్పటం మొదలెట్టాడు.ఒక కుర్రాడు కాయ విసిరాడు.రెండో క్షణంలో కాయ ఖాన్ కత్తికి తగిలి రెండుముక్కలై వెనక్కి రావటమూ వాడి మొహానికి తగలటమూ జరిగిపోయాయి. అది చూసి ఒక పది మంది కూడబలుక్కుని ఒక్కసారి విసిరారు. ఇరవై ముక్కలు ఫెడీమని రెండో క్షణంలో వాళ్ళకి తగిలాయి. మిగతా అందరూ ఏమిచేయ్యాలో తెలీక ఇష్టం వొచ్చినట్టు విసిరితే ఒక మూడు కాయలు తప్ప మిగిలినవన్నీ విసిరిన వాళ్ళకే తగిలాయి. మూడు కాయలు విసిరిన వాళ్లకి మూడైదులు ఇచ్చి మిగతావి జేబులో పెట్టుకుని లోపలికెళ్ళాడా కుర్రాడు
. ఇల్లా వారం రోజులపాటు సాగితే రెండువేలపైన పోగయ్యాయి. రోజుకి రెండో మూడో కాయలు ఖాన్ కి తగలటమూ,మిగతావన్నీ విసిరిన వాళ్ళకే తగలటమూ మామూలయ్యింది. ఇదిలా వుంటే సుబ్బరాజు మట్టుక్కూ నిమ్మకి నీరెత్తినట్టు కూచున్నాడు.రోజూ తన పనులు తను చేసుకుంటున్నాడు తప్పితే పోటీకి ఏవిధంగానూ తయ్యారవ్వట్లేదు. దీంతో ఎవ్వరికీ సుబ్బరాజు గెలుస్తాడని సరికదా, సరిగ్గా పోటీ అన్నా చెయ్యగలడా అనే శంక కలిగింది. అసలీయనకి కత్తి తిప్పటం వొచ్చా రాదా అని కూడా వూరంతా గొణుక్కుంటుంటే రాజా వారు ఒక సాయంత్రం మాటల మధ్యలో " అసలీయనని నిలబెట్టి తప్పు చేయటం లేదు కదా " అంటే దివాంజీ" ప్రభూ,నేనూ అన్ని వార్తలూ వింటున్నాను. సుబ్బరాజు ఏమాత్రమూ తయారు కావట్లేదనే కభురు ఖచ్చితమే.   కానీ,ఆరోజు దొంగల లాగా వెళ్ళిన మన భటుల్ని రెండు క్షణాల్లో మట్టి కరిపించడమూ,అదీ చూస్తే అతను సామాన్యుడు కాదని అనిపిస్తోంది. అదీనూ,పోటీ ఇంకా మూడ్రోజులే వుంది. ఇప్పుడు ఏమీ చెయ్యకపోవటమే సబవనిపిస్తోంది ప్రభూ" అన్నాడు.మహారాజు, తల పంకించాడు
పోటీ ముందు రోజు వెంకట్రాజుని పిలిచి అటక మీద పెట్టిన బుట్టలో ఉన్న తాతల కాలం నాటి కత్తిని దింపించి పెళ్లాన్ని పిలిచి "ఇదిగొ ఇలారా, దీన్ని కడిగి, పూజ గదిలో పెట్టు" అన్నాడు సుబ్బరాజు. మొగుడి మాట ఎఫ్ఫుడూ జవదాటని ఆవిడ దాన్ని చేతిలోకి తీసుకుంది. ఆమెకి ఏడుపొచ్చింది."వొద్దండీ, పోటీలవీ వొద్దండీ, మనం మన రామచంద్రపురం వెళ్ళిపోదామండీ" అని ఏడ్చింది. " చూడు పార్వతీ,మనిషి జన్మెత్తాక ఏదో ఒకటి చెయ్యాలి, అందరి మెప్పూ గడించాలి అని ఇన్నేళ్ళ నించీ నన్ను పోరేదానివి కదా. ఇప్పుడేమిటిది. ఇంకొకటి గుర్తుపెట్టుకో,దంతులూరి వాళ్ళం, మేము, కత్తిపట్టితే మమ్మల్ని ఆపగలిగే వాడు చతుర్దశభువనాల్లోనే లేడు. అనవసరంగా వెధవాయని దేవిడీలో పడేసావుగానీ లేకపోతే పాటికి ఈఖాన్లనీ గీన్లనీ వీడే ఓడించేవాడు. శుభం పలుకుతూ కత్తికి పూజ చెయ్యి, రేపు సాయంత్రం ఏనుగు నెక్కి ఇంటికొస్తానో లేదో చూ"డని సముదాయించి పంపాడు.
మరుసటి రోజు ఇంటికి పాలకీ వొచ్చింది. ఇంట్లో వాళ్ళెవ్వరూ పోటీ చూట్టానికి రానన్నారు. సుబ్బరాజు పాలకీలో తన కత్తిని ఉంచి పూలూ అవీ చల్లి రాజ భటులు ఎంత చెప్పినా విన కుండా పాలకీ వెంట నడిచి రంగ భూమికి వొచ్చాడు. రంగ భూమికి వెనకాల పక్క ఉన్న ఖాళీ ప్రదేశంలో ఖాన్ బృందం నలభై మందీ అప్పటికే వొచ్చున్నారు. సుబ్బరాజు కరీం ఖాన్ దగ్గరికి నేరుగా వెళ్లాడు."సలాం ఖాన్ జీ" అని అతణ్ణి పలకరించి వెనక్కి వొచ్చి ఒక్కడే నిల్చున్నాడు.తాము ఇంతమందిమివొస్తే ఇతనేమిటి ఒక్కడే వొచ్చాడని ఖాన్ మనసులో ఏదో శంక మొదలైంది.ఇంతలో గంట మోగింది.నలుగురు సైనికులు వొచ్చి ఖాన్ నీ సుబ్బరాజునీ తీసుకుని వెళ్ళారు. మిగిలిన ఖాన్ బృందం అందరికీ ఒక ప్రదేశం కేటాయించారు. ఖాన్ నీ సుబ్బరాజు నీ రంగం మధ్యలోకితీసుకొచ్చి సైనికులు వెళ్ళిపోయారు. జనం అందరికీ ఇద్దరూ కనబడ్డారు. ఒకపక్క కండలు తిరిగి, ఆరడుగుల అయిదంగుళాలు పొడుగూ, నిరంతర ఖడ్గవిద్యా కఠినీకృత దేహమూ,విశాలమైన వక్షమూ,అతి ఉగ్రంగా ఉండి భయం పుట్టిస్తున్న ఖానూ, రెండో పక్క అయిదున్నర అడుగుల పొడుగూ పెద్ద లావూ,పెద్ద సన్నమూ కాకుండా మధ్య రకమైన శరీరమూ, నెరిసిన తలా,మీసం తో , ఖడ్గవిద్య పోటీకొచ్చాడనిచెప్తే తప్ప గుర్తుపట్టలేనంత సామాన్యంగా  ప్రశాంతంగా కనిపిస్తూన్న సుబ్బరాజూ .ఖాన్ సుబ్బరాజుని తిరస్కారంగా చూశాడు. సుబ్బరాజు మొగం మీద భావమూ పలకలేదు. చుట్టూ ఉన్న జనం రణగొణ ధ్వని మొదలైంది. "ఈముసలాడు ఎట్లా గెలుస్తా"డనీ," ముసలాయనా, ఇంట్లో చెప్పే వొచ్చావా" అనీ రక రకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. అందరి సునిశ్చిత అభిప్రాయం ఖాన్ గెలుస్తాడనే. ఒకటికి ఇరవై నడుస్తున్నా ఇప్పటిదాకా సుబ్బరాజు మీద పందెం కట్టింది శంభుశాస్త్రే. జనం గోల పెద్దదైంది.ఇంతలో మహారాజు గారు వొస్తున్నట్టు సంకేతధ్వని అయ్యింది. సైనికులు వొచ్చి అందర్నీ సద్ది కూర్చోబెట్టారు. మహారాజూ, దివాంజీ,సేనాధిపతీ ఆసనాలు అలంకరించారు. ఖాను సలాంచెయ్యగా, సుబ్బరాజూ కత్తి దూసి వీర నమస్కారం చేశాడు.అతను వీర నమస్కారం చేసిన విధానానికి అందరూ ఆశ్చర్య పడ్డారుమహారాజు ఇంగితం తెలిసి దివాంజీ పోటీ మొదలెట్టటానికి అనుజ్ఞ ఇచ్చాడు 
 ఖాన్ పక్కకి వెళ్ళి తను అక్కడ పెట్టుకున్న తన కత్తిని తీసి మహారాజుకేసి వొంగి అభివాదం చేశాడు. నుంచుని జనాలకేసి చేతులు చాచి సింహ  నాదం చేశాడు.ప్రజలందరూ అతడే గెలుస్తాడనే విశ్వాసంతో హర్షధ్వానాలు చేశారు. చేతులెత్తి ఆపమని చెప్పాడు సేనాధిపతి.  శబ్దాలన్నీ ఆగిపొయ్యినయ్యి. ఇంతలో సుబ్బరాజు మెల్లిగా మహారాజు వైపు వెళ్ళాడు. వొంగి నమస్కారం చేసి "ప్రభూ,తమ ముద్ర ఉన్న ఒక నాణాన్ని  ఇప్పించకోరుతున్నాను" అన్నాడు.మహారాజు, దివాంజీ కేసి "ఏమిటిది" అన్నట్టు చూశాడు.దివాంజీ"తెలీద"న్నట్లు తలతిప్పి అక్కడ ఉన్న సేవకుణ్ణి పిలిచి ఒక నాణాన్ని మహారాజుల చేతికి తాకించి ఇచ్చాడు. అతను నాణాన్ని సుబ్బరాజుకి ఇచ్చాడు.సుబ్బరాజు దాన్ని కళ్ళకి అద్దుకుని తన చేతి గుడ్డకి ఒక కొసలో నాణాన్ని కట్టి  " మహారాజా కరీం ఖాన్ గారికి కత్తి తిప్పటం అంత సరిగా రాదు. అందువల్ల ఇతణ్ణి ఖడ్గవిద్యలో ఎదురుకోవటం అనవసరం. దానికి మీరిచ్చిన నాణెం చాలు ప్రభూ" అని సుస్థిరంగా నిలబడ్డాడు. ఖాన్ గుంపులో ఒకతను వొచ్చి జరిగిందంతా ఖాన్ కి చెప్పాడు.ఖాన్ కన్నుల్లో విస్ఫులింగాలు మండుతున్నయ్యి. ముఖం కందగడ్డ అయ్యింది.తన భాషలో పెద్ద పెద్దగా అరవటం మొదలెట్టాడు.ఇంతలో సేనాధిపతి సైగ తెలిసి పది మంది సైనికులు వొచ్చి రంగం చుట్టూ నిలబడ్డారు.వాళ్ళని చూసి ఖాన్ శాంతించాడు
 ఇదంతా చూస్తున్న మహారాజు,దివాంజీలకే ఏమౌతోందో అర్ధం కావట్లేదు.జనాలందరికీ అస్సలేమీ బోధపడట్లేదు.అందరికీ ఒకటి అర్ధమైందేమిటంటే ఖాన్ కత్తితో యుద్ధం చేస్తే సుబ్బరాజు తన చేతి గుడ్డతోనో, దాంట్లో కట్టిన నాణెంతోనో యుద్ధం చేస్తాడని. సుబ్బరాజు కీ , సభికుల్లో ఉన్న శంభుశాస్త్రికీ తప్ప అందరి బుర్రలూ పనిచెయ్యడం మానేశాయి. "ఇదేమిటీ, కత్తికీ, గుడ్డకీ యుద్ధమా వీడికేమన్నా మతిపోయిందా"అనీ  " పాపం అకారణంగా చచ్చిపోతాడే ముసలోడు" అనీ జనాలు అనుకుంటుంటే ఖాన్ మట్టుక్కు "నాకు విద్య రాదంటాడా,వీణ్ణీ ఒక్క దెబ్బతో చంపెయ్యాలి" అనీ " వీడికి మంత్రాలేమన్నా వొచ్చా" అని సంకట పడి "వొస్తే దానికి విరుగుడు మౌలానా గారిచ్చిన తావీజు ఉందిగా" అని ధైర్యంతెచ్చుకున్నాడు. అకారణంగా ప్రాణాలు తీసే, తీయించే, రాజసభల్లో ఇల్లాంటివన్నీ మామూలు కాబట్టి మహారాజు స్థిమితంగా కూర్చున్నాడు.దివాంజీ గారి కనుసైగతో గంట మోగింది.ఖాన్ వెళ్ళీ తన స్థానంలో నిలబడ్డాడు.కత్తి ఇందాకట్నించీ అతని భుజం మీద యుద్ధానికి సిద్ధంగా ఉంది. సుబ్బరాజు వెళ్ళి ఖాన్ కి ఎదురుగ్గా నిలబడ్డాడు. రెండో గంట మోగటంతో పాటే ఖాన్ కత్తిని తిప్పుతూ,పళ్ళు కొరుకుతూ గట్టిగా అరిచి  సుబ్బరాజు మీదికి లంఘించాడు. సుబ్బరాజు తన చేతి గుడ్డతో ఖాన్ చెయ్యి మీద కొట్టాడు.గుడ్డలోని నాణెం ఖాన్ చేతిమీద ఉన్న ఒక నరానికి తగలటమూ, ఖాన్ చేతి లోంచి కత్తి జారి పోవటమూ ఒక్క సారే జరిగాయి. సభ మొత్తం దిగ్భ్ర్రమ చెందింది. ఊపిర్లు ఆగిపోయాయి.మహారాజు నించీ మామూలు వాడిదాకా అందరూ ఒకటే అయ్యారు.ఆశ్చర్య చకితులై అలా నోర్లు తెరిచి చూస్తూండిపోయారు. ఖాన్ కి కత్తి ఎట్టా జారిందో అర్ధం కాలేదు.రోషం రెట్టింపైంది.కిందపడిన కత్తిని మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు.సుబ్బరాజుని చూశాడు. సుబ్బరాజు చేతిలో గుడ్డని పట్టుకుని భావమూ లేకుండా నిలిచి ఉన్నాడు. అతన్ని చూసిన కొద్దీ ఖాన్ కి కోపం,రోషం పెరిగిపోయినయ్యి.కత్తి వంక చూశాడు. ఇంతకుముందు దేశదేశాల్లో అనేకమంది సరదార్లనీ, యోధుల్నీ జయించిన కత్తి,ఓటమెరుగని కత్తి. దాన్ని ఒక్క సారి ముద్దు పెట్టుకుని, ఉప్పెనలాంటి ఉద్రేకంతో కాళ్ళతో భూమిని గట్టిగా తాటించి, అరిచి, కత్తిని తీసుకుని మళ్ళీ సుబ్బరాజు మీదకి వెళ్ళాడు. సుబ్బరాజు మళ్ళీ ఒక సారి తన చేతి గుడ్డని ఇల్లా విదిలించాడు. మళ్ళీ నాణెం వెళ్ళి నరాన్నే మళ్ళీ తాకింది. కత్తి మళ్ళీ కిందపడింది.    ఒక్క సారిగా జనమంతా సుబ్బరాజు చూబించిన నైపుణ్యమూ, తెలివితేటలూ మెచ్చుకుంటూ ఖాన్ గురించి అవహేళన గా మాట్టాడసాగారు. ఉక్రోషం పట్టలేకపోయాడు ఖాన్. అక్కడ మహారాజు ఉన్నాడనేది కూడా మర్చిపోయి, వాడి భాషలో తిట్టసాగాడు. ఇంతలో దివాంజీ సన్న చేస్తే నలుగురు సైనికులు రావటం చూసి తగ్గాడు. గుంపులోంచి తన దుబాసీని పిలిచి ఏదో చెప్పాడు ఖాన్. వాడు మహారాజు ముందుకు వొచ్చి సలాం చేసి,"ప్రభూ, ఇక్కడకి మేము కత్తి పోటీలకొచ్చాము కానీ ఏదో మాయల పోటీలకి కాదుకదా" అన్నాడు.మహారాజు ఏమిచెబ్తావన్నట్లుగా సుబ్బరాజు వైపు చూశాడు. సుబ్బరాజు ముందుకు వొచ్చి " మహారాజా కత్తి యుద్ధ్హానికి నేనెప్పుడూ సన్నద్ధమే. మా కుటుంబంలో కొన్ని వేల యేళ్ళుగా ఆగకుండా వొస్తున్న విద్యా పరంపర ఇది ప్రభూ. పాండవుల్లో వొకడైన నకులుడి వొద్ద మా పూర్వీకులు నేర్చుకున్న విద్య ఇది . దీన్ని హృషీకేశంలో చిదానంద స్వామి ఆశ్రమంలో అయిదేళ్ళుండి మెరుగు పర్చుకున్నాను. నన్ను కరీం ఖాను తాకను కూడా తాక లేడు ప్రభూ అందువల్ల పోటీ ఉండాలీ అంటే కరీంఖాన్ బృందంలో విద్య బాగా తెలిసిన ఉన్న ఇరవై ఆరుగుర్నీ కరీం ఖాన్ తో బాటు రమ్మనమనండి. పోటీలో పదునులేని కత్తులు వాడితే వాళ్ళకి ప్రమాదం ఉండదు" అన్నాడు. దుబాసీ అంతా చెబితే కరీం ఖానూ మిగతా అందరూ పోటీకి సిద్ధమయ్యారు. ఇరవైఆరుగురూ కరీంఖానూ పోటీ కత్తుల్తో సిద్ధంగా  ఉన్నారు ఇటు పక్కన సుబ్బరాజు హిమాలయంలా చెక్కు చెదరకుండా ఉన్నాడు. గంట మోగింది. అందరూ కలిసి కూడ బలుక్కుని ఒక్క సారి సుబ్బరాజు మీద పడ్డారు. అయిదు నిమిషాల్లో ఆరుగురికి కాళ్ళు విరిగాయి , అయిదుగురికి గూడలు జారాయి.నలుగురికి చేతులు విరిగాయి. పదో నిమిషంలో కరీంఖాన్ తప్ప మిగతా వాళ్ళందరూ గాయాలతో కింద పడిపోయి ఉన్నారు. ఖానుకి కూడా మోకాలి మీదా ముఖం మీదా పెద్ద దెబ్బలే తగిలినా పట్టుదలతో ఎల్లాగైనా ఓడించాలని కత్తి తిప్పుతూ కలియబడ్డాడు.ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ నిలుపుకుంటూ వొస్తున్న బిరుదాలూ,ప్రతిష్టా నేలపాలై పోతయ్యేమోననీ, వాటిని ఎట్టాగైనా నిలబెట్టాలనీ ఖాన్ ఉద్డండ క్రోధం తో కత్తి తిప్పుతూ కలియబడ్డాడు. ఒక్క క్షణం కన్ను మూసి తెరిచేసరి కల్లా ఖాన్ కత్తి సుబ్బరాజు చేతిలోకి వెళ్ళిపోయింది.ఖాన్ కి ఎక్కడలేని తెగింపూ వొచ్చి సుబ్బరాజు మీదకి కలబడి సుబ్బరాజు మెడని తన చేతుల మధ్య ఇరికించి నొక్కసాగాడు. సైనికులు కదలబోయి దివాంజీ సైగ చూసి ఆగారు.సుబ్బరాజు రెండు చేతుల మధ్యవేళ్ళనీ దగ్గరగా బెట్టి ఖాన్ గుండెలమీద ఒక్క పోటు పొడిచాడు.ఖాన్ నేలమీద పడిపోయి కదలలేదు. సుబ్బరాజు కొద్దిగా గాలి పీల్చుకుని"ప్రాణభయం ఏమీలేదు.మొఖాన నీళ్ళు కొట్తండి. పది నిముషాల్లో లేచి కూచుంటాడు" అన్నాడు. అలాగే చేస్తే పది నిముషాల తరవాత లేచి కూచున్నాడు సాయంత్రం రాచ ఏనుగెక్కి  ఖాన్ బృందమూ,ఠాణేదారూ ముందు నడవగా ఊరంతా ఊరేగి ఇంటికి చేరుకున్న శ్రీ శ్రీ శ్రీ సుబ్బరాజు గారికి ధర్మపత్ని పార్వతమ్మ గారు దిష్టి తీసింది.మర్నాటి నించీ పెద్దాపురం కోటలో వెలిసిన ఖడ్గ విద్యా శాలలో వెంకట్రాజు ఉద్యోగం మానేసి మరీ జేరాడు. సుబ్బరాజు గారు మీసం తిప్పుకుంటూ పెద్దాపురం కోటంతా ఖులాసాగా తిరుగుతున్నారు.