Thursday, 15 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 9 - 12 (with Audio)


1-9
శ్లోకం
వల్లవారుణ పాణిపంకజ సంగివేణురవాకులం
ఫుల్లపాటలపాటలీపరి  వాదిపాదసరోరుహమ్
ఉల్లసన్మధురాధరద్యుతి మంజరీసరసాననం
వల్లవీకుచకుమ్భకుంకుమ పంకిలం ప్రభుమాశ్రయే.



బాలకృష్ణుడి అరచేతులు పద్మాలలాగా ఎర్రగా ఉన్నాయి. అందంగా ఉన్న చిగురాకులవంటి చేతులలో ఆయన మురళిని ధరించి ఉన్నాడు. ఆ మురలీనాదంలోని మాధుర్యం వల్ల ఆయన పారవశ్యస్థితిలో ఉన్నాడు. ఆయన పాదాలు ఎర్రగాపూచిన పూలకంటేకూడా ఎర్రగా ఉన్నాయి. పూగుత్తులలాంటి ఆయన పెదాలలోని మాధుర్యం వర్ణించటానికి మాటలు చాలవు. రేపల్లెలోని యువతులు బహుసుందరుడైన  ఆ గోపాలకృష్ణుడిని  తమ శృంగారనాయకుడిగా భావించి ఆయనని కౌగిలించుకున్నప్పుడు వారు హృదయానికి రాసుకున్న కుంకుమపువ్వు అంటుకుని ఆయన వక్షం కూడా ఎర్రటి పూత పూసినట్లున్నది. 

1-10

శ్లోకం
అపాంగరేఖాభి రభంగురాభి
రనంగరేఖారసరంజితాభిః
అనుక్షణం వల్లవ సుందరీభి
రభ్యస్య(ర్చ్య) మానం విభు మాశ్రయామః 




సర్వాంతర్యామి అయిన ఆ గోపాలకృష్ణుడు ఎల్లప్పుడూ తనకు ప్రియమైన వారిపై కరుణావీక్షణాలు ప్రసరిస్తూ ఉంటాడు. ఆ చూపులు సామాన్యమైనవి కావు. శృంగారరసభరితమైనవి. అందుకనే రేపల్లెలోని సుందరీమణులంతా ఆయనను తమ శృంగార నాయకునిగా భావించి నిరంతరం ఆనందం పొందుతూ ఉంటారు. అటువంటి శ్రీకృష్ణ ప్రభువుని ఆశ్రయిస్తున్నాను.


1-11

శ్లోకం
హృదయే మమ హృద్యవిభ్రమాణాం
హృదయం హర్ష విశాలలోలనేత్రమ్
తరుణం వ్రజబాలసున్దరీణాం
తరళం కించన ధామ సన్నిధత్తామ్



బాలగోపాలుడు తనలో ఉన్న దైవత్వాన్ని మనోహరమూ, చంచలమూ అయిన తన కళ్ళద్వారా ప్రదర్శిస్తూ ఉంటాడు. రేపల్లె లోని గోపకాంతలు  ఆయనను యువకుడైన శృంగారనాయకుడిగా భావిస్తుంటారు. వర్ణనకి అలవికాని ఆ గోపాలకృష్ణుని లోకోత్తర దివ్యసౌందర్యం ఎల్లప్పుడూ నా హృదయంలో స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను.

1-12

శ్లోకం
నిఖిలభువనలక్ష్మీ నిత్యలీలాస్పదాభ్యాం
కమలవిపినవీధీ గర్వసర్వంకషాభ్యామ్
ప్రణమదభయదాన ప్రౌఢిగాఢాదృతాభ్యాం
కిమపి వహతు చేతః  కృష్ణపాదాంబుజాభ్యామ్



శ్రీకృష్ణుని పాదాలు చాలా విశిష్టమైనవి. అన్ని లోకాలలోని లీలావిలాసాలకు అవి నిలయాలు. ఆ పాదాల శోభ తమ సౌందర్యాన్ని చూసుకుని పొంగిపోయే తామరపూల గర్వాన్ని నిశ్శేషంగా హరించివేస్తుంది. ఆ పాదాలు తమకి భక్తితో నమస్కరించేవారికి ఉదారంగా అభయప్రదానం చేస్తాయి. అటువంటి పాదాల అనిర్వచనీయమైన అనుగ్రహం నా మీద ప్రసరించాలని కోరుకుంటున్నాను

No comments:

Post a Comment