1-16
శ్లోకం
మణినూపురవాచాలం
వందే తచ్చరణం విభోః
లలితాని యదీయాని లక్ష్మాణి
వ్రజ వీధిషు
రేపల్లెలో బాలగోపాలుడు తిరిగిన అన్ని ప్రదేశాల్లోనూ ఆయన సుకుమారమైన పాదాల గుర్తులు పడుతున్నాయి. ఆయన కాళ్ళకి ఆభరణాలుగా ధరించిన మణులు పొదిగిన అందెలు మధురంగా మోగుతున్నాయి. అటువంటి బాలగోపాలుని పాదాలకి నమస్కరిస్తున్నాను.
1-17
శ్లోకం
మమ చేతసి స్ఫురతు వల్లవీవిభో ర్మణినూపురప్రణయి మంజుశింజితమ్
కమలావనేచర కళిన్దకన్యకా కలహంసకంఠకలకూజితాదృతమ్
గోపస్త్రీలకు ప్రాణనాయకుడైన ఆ బాలగోపాలుని అందెలధ్వని కాళిందీనదిలో ఉండే కలహంసలు చేసే అస్పష్ట మధురధ్వనులకంటే శ్రావ్యంగా ఉన్నది. ఆ గోపాలుని దర్శనం కాకపోయినా పరవాలేదు. మనోహరమైన ఆయన అందెల ధ్వని నిరంతరం నా మనస్సుకి ఆనందం కలిగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
1-18
శ్లోకం
తరుణారుణ కరుణామయ విపులాయత నయనం
కమలాకుచ కలశీభర విపులీకృత పులకమ్
మురళీరవ తరలీకృత మునిమానస నళినం
మమఖేలతు మదచేతసి మధురాధర
మమృతమ్
ఆ బాలగోపాలుని పెదవులు తనలో నిండిఉన్న అమృతత్వ ప్రభావంతో మధురంగా ఉన్నాయి. ఆయన కళ్ళు లేత సూర్యునిలాగా ఎర్రగా ఉండి దయాపూరితాలై విశాలంగా ఉన్నాయి. ఆయన తన కౌగిలింతలతో లక్ష్మీదేవికి గగుర్పాటు కలిగిస్తున్నాడు. మధురమోహనమైన తన మురళీనాదంతో ఆయన మునుల హృదయాలలో ఆర్ద్రత నింపుతున్నాడు. అటువంటి గోపాలకృష్ణుడు ఎల్లప్పుడూ నా హృదయంలో ఆడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను.
అబ్బ చాలా బాగుంది.
ReplyDeleteమీ కృషి అభినందననీయమైనది
- భాగవత గణనాధ్యాయయి