మల్లిక
నల్లనయ్య సవిలాసంగా అడవి మధ్యలో పెద్దదిగా పెరిగిన మర్రి చెట్టు కింద కూర్చుని
ఉన్నాడు.చుట్టూ ఉద్ధవుడూ,ఇంకా పదిమంది గొల్లల పిల్లవాళ్ళూ ఉన్నారు.పిల్ల లందరూ
హుషారుగా కూని రాగాలు తీస్తూ మధ్య మధ్యలో ఒకళ్ళని ఇంకొకళ్ళు ఎక్కిరించుకుంటూ
ఏడిపించుకుంటూ అన్నాలు తింటున్నారు. కాలం ఎగిరిపోతోంది.పక్కనే ఉన్న యమున కూడా
పిల్లల ఆటపాటలతో వంత కలిపి తను కూడా వేగంగా శబ్దాలు చేసుకుంటూ పరవళ్ళు తీస్తోంది.
పిల్లలు అందరూ ఇట్టా ఉత్సాహంగా సరదాగా ఆలోచిస్తూఉంటే వాళ్ళ మధ్యలో ఏదో ఆలోచిస్తూ
కూర్చుని కనిపిస్తూ ఉన్నాడే వాడే వాచస్పతి. వయసు చిన్నదే అయినా బుర్ర పెద్దది.
దాన్నిండా ఎప్పుడూ సందేహాలూ సమస్యలూ. వాడి సందేహాలు తీర్చలేక గోకులంలో పెద్ద
వాళ్ళు అందరూ తలలు పట్టుకుంటూ ఉంటారు.పిల్లలందరికీ వాడు ఎంతో తెలివి గల వాడని పెద్ద నమ్మకం అందుకని వాడు ఎప్పుడన్నా
మాట్లాడుతూంటే అందరూ శ్రద్ధగా ఆలకిస్తారు.అప్పుడప్పుడూ వాడు కృష్ణుడి ని కూడా వాడి కొచ్చే సమస్యలతో సతమతం చేస్తాడు.
కానీ కృష్ణుడు మెడకేసీ కాలికేసీ ఏదో ఒకటి
మాయ చేసి వాడి సందేహం తీరుస్తాడు. అట్టాంటి వాచస్పతి, పిల్లలు అందరూ గోలగా కబుర్లు
చెప్పుకుంటుంటే ముందుకి వంగి “కృష్ణా ఒక సందేహం” అన్నాడు. పిల్లల అల్లరీ ,మాటలూ
,గోలా ఒక్కసారి ఆగిపోయ్యాయి.అందరూ వాచస్పతి వంకే చూస్తున్నారు. కృష్ణుడు సుందర
మందస్మిత వదనంతో చెప్పు అన్నట్టు పెరుగు మాగాయి తింటున్న చేతితో సైగ చేసాడు. “నీకు
గోకులంలో ఉన్న అబ్బాయిల్లో ఎవరంటే ఇష్టం “
అన్నాడు వాచస్పతి.కృష్ణుడు జగన్మోహనంగా నవ్వాడు. నవ్వుతూ నోట్లో ఉన్న ముద్ద
ని తింటూ ఎడం చేత్తో పక్కనే ఉన్న ఉద్ధవుడి భుజం మీద చెయ్యి వేసి దగ్గరకి లాక్కుని
అతని బుగ్గకి తన బుగ్గని రాశాడు. చుట్టూ
ఉన్న పిల్లలందరూ కేరింతలు కొట్టారు. కృష్ణుడి భోజనం అయిపొయింది. పిల్లల అందరి
భోజనాలూ చివర కొచ్చేసినయ్యి.”ఇంకో సందేహం” అన్నాడు వాచస్పతి.”సరే అడుగు కానీ
ఇవాల్టికి ఇదే చివరిది” అన్నాడు కృష్ణుడు.“ నీకు గోకులంలో ఉన్న అమ్మాయిల్లో ఎవరంటే
ఎక్కువ ఇష్టం” అన్నాడు వాచస్పతి. అక్కడ ఉన్న పిల్ల లందరూ ఒక్కసారి కేరితలు
కొట్టారు.ఉలిక్కిపడి యమున వేగం ఆపి తలెత్తి పైకి చూసి మళ్ళీతన ప్రవాహాన్ని
కొనసాగించింది. “ ఇది అన్నిటి కంటే కష్ట మైన ప్రశ్న” అన్నాడొకడు. “ భలే భలే” అని
హర్షాతిరేకంతో కేరింతలు కొట్టాడింకొకడు.”
జవాబు రాధమ్మే అని అందరికీ తెలుసు” అని జనాంతికంగా అన్నాడు ఇంకొకడు. చెప్పు”
“చెప్పు” అంటూ అందరూ గొడవ గొడవ గా హడావిడిగా అడుగుతూ ఉంటె ” అందరూనూ” అంటూ లేవబోయాడు కృష్ణుడు.” ఎవరన్నా
ఏమన్నా అడిగితె సరిగ్గా సమాధానం చెప్పే భోజనం ముందు నించి లేవాలి కదా. లేకపోతే మన
గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి కి కోపం వొచ్చి పది రోజులు జ్వరం వొస్తుందని మా నాన్న
చెబుతాడు.” అన్నాడు వాచస్పతి. పిల్ల
లందరూ మళ్ళీ ఒక సారి అంగీకార సూచకంగా కేరింతలు కొట్టారు. సరే తప్పదని జగన్మోహనంగా
నవ్వుతూ కృష్ణుడు వొంగి ఉద్ధవుడి చెవిలో “ ఏమి చేద్దాం , ఇట్లా చెప్పానని అందరికీ
తెలిస్తే కష్టం కాదా “ అంటూ గొంతు
సవరించుకున్నాడు. తరవాత వొచ్చే ఎన్నో ప్రణయ కలహాలకి ఈ జవాబు నాంది అవుతుందని ఊహించని ఉద్ధవుడు” నిజం చెప్పు
కృష్ణా భయం దేనికి “ అన్నాడు.తన మిత్రుడిని చూసి ఒక సారి చిరునవ్వు నవ్వి ముందుకి
వొంగి “ఇది రహస్యం , మీరు ఇది మన గోకులంలో వాళ్ళెవ్వరికీ చెప్పకూడదు సరేనా “
అన్నాడు కృష్ణుడు. అందరూ “సరే “ అంటూ కృష్ణుడి చేతిలో చెయ్యి వేశారు. “ నాకు ఎవరు
ఇష్టమో చెబుతాను కానీ ఎందుకో ఎవరూ అడగ కూడదు.” అని ఒక క్షణం ఆగి తన చిరునవ్వుల
అస్త్రాన్ని మరో మారు సంధించి “ మల్లిక “ అన్నాడు కృష్ణుడు. రాధతో ఉన్న అనుబంధం
అందరికీ తెలుసు కాబట్టి రాధ పేరు
చెబుతాడని అందరు పిల్లలూ ఊహిస్తే వేరే పేరు చెప్పే టప్పటికి అందరికీ ఆశ్చర్యం
వేసింది. “ఎందుకు “ అని ఎవరో అడగపోతుంటే
చేత్తో వారిస్తూ లేచి యమునా నది దగ్గరి కెళ్ళి చేతులూ కాళ్ళూ కడుక్కుని వెనక్కి
వొచ్చాడు. మెల్లిగా పిల్ల లందరూ లేచి వాళ్ళ ఆవులు ఎక్కడున్నయ్యో చూట్టానికి
వెళ్లారు.కృష్ణుడూ ఉద్ధవుడూ మాత్రమె మిగిలారు.
“అదేంటి కృష్ణా, నిన్ను అమితంగా ప్రేమించి లాలించే రాధ పేరు చెబుతా
వనుకున్నాను.నీకోసం రోజూ వొచ్చి ,నీతో ఆడుతూ పాడుతూ నిన్నే ఎప్పుడూ తలుచుకునే
వాళ్ళు ఎంతో మంది ఉంటె వాళ్ళందరినీ వొదిలేసి మల్లిక పేరు ఎందుకు చే ప్పావో నాకు అర్ధం కాలేదు. తను ఒక్కసారి వొచ్చి నీతో
మాట్టాడినట్టు గుర్తు.మళ్ళీ ఎప్పుడూ మనతో ఆటలాడటానికి రాలేదు. వాళ్ళిల్లు మా ఇంటికి దగ్గర కదా
ఎప్పుడూ నీ పేరు కూడా అక్కడ నిండి వినబడలేదు,మరి అట్టాంటిది” అంటూ అర్దోక్తితో
ఆగిపోయాడు.కృష్ణుడు ఒక చిరునవ్వు రువ్వాడు.”ఇవ్వాళ్ళ నించీ ఒక వారం రోజులు
మల్లికవాళ్ళ ఇంట్లో తిరుగు. తనతో మాట్టాడుతూ ఉండు.రోజూ నన్ను కలిసి ఏమి జరుగుతోందో
చెప్ప ” మని వెళ్లి పోయాడు.
ఉద్ధవుడు మెల్లిగా మల్లికా వాళ్ళ ఇంటికి చేరాడు.మల్లిక శ్రద్ధగా చల్ల
చిలుకుతోంది. ఉద్ధవుడిని చూసి “రా ఉద్ధవా,కూర్చో చాలా రోజుల తరవాత కనిపించావు.
కొద్దిగా మీగడ తీసుకుంటావా ” అంటూ లేచి మీగడ మీద కాస్త తేనే వేసి పళ్ళాన్ని
ఉద్ధవుడి కిచ్చింది. “ చాలా మధురంగా ఉంది “ అని తింటూ, “ నువ్వు కూడా మిగతా అందరు
పిల్లల లాగే కలిసి ఆడుకోటానికి రావేం” అని అన్నాడు. “ నాకు బోలెడు పనులు. ఎక్కడ
కుదురుతుందీ” అని దీర్ఘం తీసింది మల్లిక.
“ ఒక సారి వచ్చావు కదా” అన్నాడు
ఉద్ధవుడు
“ వొచ్చాను”
“ మళ్ళీ రావాలనిపించ లేదా ఎప్పుడూ”
“ ఊహూ”
“ ఏం, ఎవరన్నా దుష్టుగా...”
“లేదు.అంతవరకూ వొస్తే కళ్ళు పొడిచేయ్యనూ ”
“మరి”
“మరి”
“రావాలని పించలేదు”
“ ఊరందరూ వొస్తుంటే నువ్వు రాక...”
“ బాగుంది. ఎవరి వీలూ ఇష్టాలూ వాళ్లవి”
“ నీ వీలుకేం తక్కువ. ఉన్న ఇల్లు. మందీ మార్బలం,నౌకర్లూ చాకర్లూ ఉన్నారు
కూడాను.”
“ ఎవరి పన్లు వాళ్ళ కుంటయ్యి.”
“మరి”
“-----“
“మరి ఎందుకిష్టం లేదు”
“ఇష్టం లేదని ఎవరన్నారు”
“మరి రావేమీ”
“----“
“ ఇవాళ్ళ వొస్తావా”
“ చూద్దాంలే”
కాదు చేద్దాంలే అను”
“ ఉండు ఆలోచించనీ” అంటూ లేచి వెళ్లి వేరే పని అందుకుంది. సాయంత్రం జరిగినదంతా
కృష్ణుడికి చెబితే గట్టిగా నవ్వాడు.
మర్నాడు ఉద్ధవుడు మళ్ళీ వొచ్చాడు.
“నిన్న ఆట పాటలు ఎంత బాగా జరిగినయ్యో తెలుసా “
“ఊ ..”
“నువ్వు రాలేదన్నదొక్కటే లోటు. కృష్ణుడూ ప్రియంవదా కలిసి బాగా నాట్యమాడారు.”
“మంచిది”
“ఇవ్వాళ్ళ రాకూడదూ”
“ దేనికి”
“ నాట్యం చేయటానికి”
“ దానికి చాలా మంది ఉన్నారుగా, నేనెందుకూ”
“నువ్వు వాళ్ళ అందరి కంటే అందగత్తెవీ, తెలివి తేటలు కలదానివీ కదా “
పగలబడి నవ్వింది మల్లిక.” అతని కంటే ఘనుడు ఆచంటి మల్లన్న అన్నట్టు నువ్వు
వాడితో తిరిగి వాడి కంటే ఎక్కువగా తయారయినట్టున్నావే.”
“ అదేమీ లేదు. ఉన్న మాట చెబుతున్నాను”
“ నా కంటే అందగత్తెలూ తెలివి కలవాళ్ళూ గోకులంలో బోల్డు మంది అని నాకూ నీకూ
తెలుసు ”
“ తావలచింది రంభ అన్నారు కదా పెద్దలు, ఎవరి అభిప్రాయం వారిది”
“ పొరపాటున నన్నేమన్నా వలఛి ఇల్లా పగలూ రాత్రీ నా చుట్టూ తిరుగుతున్నావా”
“నేను కాదు”
“ ఓహో ఇది దౌత్యమా, ఎవరికోసం ”
“ కృష్ణుడి కోసం”
“ వాడికి చుట్టూ ఉన్న వందల వేల మంది చాల లేదా “
“ వాడు ,వీడు ఏమిటి .కాస్త గౌరవం గా మాట్లాడచ్చుగా”
“నాకంటే పది నెలలు చిన్న ,అట్టాంటి వాడిని వాడు అనక దేవుడు అననా ”
ఇలా మూడు రోజులు గడిచాయి.మూడో రోజు
సాయంత్రం ఉద్ధవుడు చెప్పే విషయాన్ని నవ్వుతూ వింటూ”నేను మల్లికని
ప్రత్యేకంగా ఆటలకి రమ్మన్నానని చెప్పు” అన్నాడు కృష్ణుడు.
మర్నాడు పొద్దున్న మల్లికా వాళ్ళ ఇంటికి వెళ్లాడు ఉద్ధవుడు. మల్లికఎంతో
ఉత్సాహంగా “ మా నీలవేణికి కొడుకు పుట్టాడు. జున్ను పాలు తీసుకో “మంటూ గిన్నె నిండా
ఇచ్చింది. ఉద్ధవుడు తింటూ “ కృష్ణుడు నిన్ను ఇవాళ్ళ సాయంత్రం ఆటలకి రమ్మని
ప్రత్యేకంగా చెప్పి మరీ పంపించాడు” అన్నాడు.
“ఆటలు ఎవరితో నైనా ఎప్పుడైనా ఆడొచ్చు”
నిజమే కానీ కృష్ణుడి ఆటలు వేరు”
“ ఏం వేరు “
“ వాడు జగన్మోహనుడు. వాడి నవ్వు అతిలోక సుందరంగా ఉంటుంది”
“ఒక సారి చూసాను”
“చాలా బాగా మురళి వాయిస్తాడు .”
“ఓసారి విన్నాను”
తనతో ఆడుతూ ఉంటె వొళ్ళు తెలీదు.
“ఓసారి ఆడాను”
“ ఇంకోసారి వొచ్చి వినచ్చు చూడచ్చు ఆడొచ్చు.”
“ నా వల్ల కాదు”
“ఏం ఎందుకని”
“ నా వల్ల కాదు అర్ధం చేసుకో”
“నాకు అర్ధం కావట్లేదు. కృష్ణుడు ఆటలకి ఇప్పటి దాకా ఎవరినీ రమ్మని పిలవలేదు.
మొదటి సారి నిన్ను పిలిస్తే ....... “
“అది కాదు...”
“ఏమి చెప్పమంటావు కృష్ణుడికి”
“.....”
“ ఒక మాట అడగనా “
“ఊఉ “
“ ప్రపంచం లోకెల్లా అత్యంత సుందరమైనదీ మధురమైనదీ ఆనంద కరమైనదీ అయిన వస్తువు నీ
చేతిలోకి వొస్తే నువ్వు ఏమి చేస్తావు”
“ దాన్ని మాటిమాటికీ చూసీ మాటిమాటికీ అనుభవించీ సుఖపడతాను”
“ అంత అరుదైన అత్యంత ఆనందకరమైన అనుభవం
మొదటి సారి కలిగింతరవాత, అదే వస్తువు
రెండో సారి మళ్ళీ అంతే ఆనందాన్ని, అదే రకమైన ఆనందాన్ని ఇస్తుందా? చెప్పు. మొదటి
సారి ఉన్న ఆ కొత్త దనమూ ,అమాయకత్వమూ, ఆ వస్తువుని గురించిన అనుభవ రాహిత్యమూ ఆ వస్తువుని రెండో సారి అనుభవించేటప్పుడుదొరుకుతుందా....
“ నిజమే , మొదటి సారి ఆ వస్తువు గురించి పూర్తిగా తెలియనప్పుడు వొచ్చే అనుభవం
ఆ వస్తువు వల్ల మళ్ళీ ఎప్పుడూ కలగదు.తరవాత
కలిగేది పాత అనుభవాన్ని మళ్ళీ గుర్తుకి తెచ్చుకోవటానికి ప్రయత్నించటమే.”
“ మరి నన్ను మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు వాడు”
“ వాడు అంటే కృష్ణుడాచివరికి ఆ పేరు
కూడా ఇప్పటిదాకా నీ నోటి నుండి రాలేదు. “
“ ఊ...”
“అందరూ అత్యంత ప్రేమతో పిలిచే కృష్ణుడిని వాడు అనా పిలిచేది వాడేదో దుర్మార్గుడైనట్టూ.“
అన్నాడు ఉద్ధవుడు.
మల్లిక ఒక్క సారి ఏడవడం మొదలెట్టింది. అప్పటిదాకా అంత ధీర గా ఉన్న మల్లిక అలా
బేలగా అవటం తో ఉద్ధవుడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు.” “ఏడవొద్దు , ఎందుకు ఇలా
ఏడుస్తున్నావు” అన్నాడు ఉద్ధవుడు. తెప్పరిల్లింది మల్లిక.
“ నాకు మిమ్మల్నందర్నీ చూస్తె ఆశ్చర్యం వేస్తుంది. వాడి పేరు ఎలా పలుకుతారా
అని”
“ ఏం , అందమైన పేరు, ఆనందాన్నిచ్చే
పేరు కదా అది”
“ ఆవును కానీ నేను పలకలేను”
“ ఏదీ ఎందుకు కాదో ప్రయత్నించు చూదాం” అన్నాడు ఉద్ధవుడు.
“ సరే నీ ఇష్టం” అని నిటారుగా కూచుని
రెండు చేతులూ నుదుటన జోడించి కళ్ళు మూసుకుని “కృ”అన్నదో లేదో అల్లాగే పక్కకి ఒరిగిపోయింది.ఉద్ధవుడు
వెళ్లి నీళ్ళు తెచ్చి పరిచర్యలు చేస్తే ఎప్పటికో తేరుకుంది మల్లిక.
లేచి కూర్చుని ఉద్ధవుడికి మొగం చూపించకుండా తిరిగి కూచుంది.నుదుట అంజలి బంధంతో
కృష్ణుడి ఇంటి వైపుకి తిరిగి నమస్కారం చేసి కూర్చుంది.
“ ఉద్ధవా, ఆరు నెలల క్రితం ఒక రాత్రి నేను కూడా ఆటలకి వొచ్చా గుర్తుందా.అక్కడ
వాడి పాటా ఆటా వేషలూ భూషలూ చూసా మనస్సు ఆనందంతో నిండి పోయింది. వాడు తప్ప ఇంక
ప్రపంచం లో ఉన్నవన్నీ వ్యర్ధం అనిపించింది. వాడు అని ఎందుకంటున్నానంటే వాడు నా
మనసులో ఎంతగా నిండి పోయాడంటే వాడి పేరు తలిస్తే చాలు ఆనందంతో వొళ్ళు మరిచిపోతున్నాను. వాడి పేరులో
ఉన్న మొదటి అక్షరం తో మొదలయ్యే పదాలు కూడా నన్నీలోకం లో లేకుండా చేస్తున్నయ్యి.
ఎందుకో తెలీదు కానీ ఉద్ధవా, అప్పటి నుంచీ వాడు నా వాడనీ , వాడు నా వాడేననీ
అనిపిస్తోంది. వాడి పేరును కూడా పలకలేను కానీ వాడు నిజం గా నావాడే “ అని
డగ్గుత్తికతో మాట్లాడి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
ఉద్ధవుడికి ఏం మాట్లాడాలో తెలియలేదు.
“ మీరందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు, వాడి పేరు మాటి మాటికీ తలవటానికి . నేను
చూడు ఎంత దురదృష్ట వంతురాలినో వాడు అని
తప్ప వాడి అసలు పేరు కూడా తలవలేను” అంటూంటే కంఠం పూడుకుపోయింది మల్లికకి. మెల్లిగా
కాసేపటికి తేరుకుని” వాడు అన్నిటా ఉన్నాడనీ, అంతటా ఉన్నది వాడేననీనాకు తెలుసు. వాడు
లేకపోతే నేను లేననీ తెలుసు. ఇలా అనుకుంటూ వాడి దగ్గరకి రావటానికి ప్రతిరోజూ
శ్రద్ధగా తయారవుదామనే మొదలెడతాను కానీ వాడి దగ్గిరికి వెళ్ళే సమయందగ్గరికొస్తున్న
కొద్దీ మనసు మనసు లో ఉండదు. అందరినీ రమ్మనంటూ వాడు చేసే వేణుగానం వినబడుతూ
ఉందనగానే కృష్ణుడు మా ఇంటికి వచ్చేస్తాడు. నా చుట్టూ తిరుగుతాడు. అదిగో ఆ బావి చుట్టూ తిరుగుతూ మురళి వాయిస్తాడు. ఎంత
మధురంగా ఉంటుందంటే నన్ను నేనే మర్చి పోతాను. అదిగో ఆ తిన్నె మీద ఎక్కి నడుము పక్కన
చేతులు పెట్టి మధ్య మధ్యలో చప్పట్లు
కొడుతూ పాటలు పాడుతూ.....” అని మధ్యలో
ఆనందం ఎక్కువయ్యి మాటలు రాక ఆగిపోయింది. ఆమె చెబుతున్న విధానమూ ఆ ముఖం లో కనిపించే
పారవశ్యమూ, ఆ మాటల్లో వినిపించే స్వచ్ఛతా, ఉద్ధవుడిని వేరే లోకాలకి
తీసుకెళుతున్నాయి. తిన్నె మీద నాట్యం చేస్తూ కన్ను గీటు తున్న కృష్ణుడు
కనిపించాడు. ఇక్కడికి ఎప్పుడు వచ్చాడా అని ఉద్ధవుడు అనుకునేంతలో అక్కడ కృష్ణుడు లేడు . మెల్లిగా
సంబాళించుకుంది మల్లిక.
“ ఉద్ధవా, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ రకరకాల వేషాలు వేస్తాడు. నన్ను ముద్దు
పెట్టుకొమ్మని వొస్తాడు దగ్గరికి తీసుకొని ముద్దుపెడదామంటే దొరకడు.ఎన్నెన్ని
వేషాలు, ఎన్నెన్ని పోకిళ్ళూనూ రోజూ. పక్కనే కూచుని కధలు చెబుతాడు
మధ్యలోవెళ్ళిపోతాడు.ఎక్కడికి పోయ్యాడా అని చూస్తుంటే ఎక్కడినించో ప్రత్యక్షం.
వేపుకుతినేస్తాడనుకో. ఇదంతా అయ్యేసరికి తెల్లారుతుంది. ఇంక యమునా విహారానికి ఎలా
రాను, చెప్పు” అంది.
ఉద్ధవుడి మనస్సు ఆనంద తరంగితమైంది. లేచి పాడుతూ
పరిగెత్తుకుంటూ వెళ్ళి మల్లిక తోడుపెట్టిన పెరుగుగిన్నెని తీసుకుని మాయమయ్యాడు.
కాసేపటి తరవాత , చీకటి ఇంకా చిక్కబడలేదు. యమునా తీరం. కృష్ణుడు ఆవు దూడతో
గంతులు వేస్తున్నాడు. ఉద్ధవుడిని చూసి ఎగురుకుంటూ వొచ్చి” చేతిలో ఏమిటి” అన్నాడు
కృష్ణుడు.” నీకు తెలీదా” అన్నాడు ఉద్ధవుడు. గిన్నెని తీసుకుని పెరుగు తింటూ “ ఏమంది,మల్లిక ,
ఇవ్వాళ్ళ వొస్తానందా ” అన్నాడు కృష్ణుడు.
“నువ్వే వాళ్ళింటికి రోజూ రాత్రి వెళుతున్నావుట కదా, అందుకని రావక్కర్లేదని
చెప్పింది.”
“ ప్రతి రాత్రీ మనందరం కలిసి ఇక్కడ ఆడుకుంటున్నాం కదా?.”
“ ఏమీ తెలీనట్టు. రోజూ వాళ్ళింటికి వెళుతున్నావుట ?”
“నేను ఇక్కడే అందరితో ఆడుతున్నాకదా ”
“నన్ను మాయ చెయ్యకు.మల్లికా వాళ్ళింటికి వెళుతున్నావాలేదా “
“అవును “
మరి మాకెవ్వరికీ చెప్పలేదు”.
“ అది ఆంతరంగిక సమావేశం” అని నవ్వాడు కృష్ణుడు.
“ భక్తుడి హృదయంలో భగవంతుడు ఉంటే , ఆ భక్తుడి చుట్టూ భగవంతుడే తిరుగుతూ
ఉంటాడు” అని ఉద్ధవుడి చెవిలో ఎవరో చెప్పినట్టయ్యింది.”కృష్ణా” అనుకుంటూ ఉద్ధవుడు చూస్తే ,కిలకిలారావాలు
చేసుకుంటూ వస్తోన్న గోపికా రమణులని స్వాగతిస్తూ సుమనోహరంగా గానం చేస్తోన్న
కృష్ణుడి పాటకి బృందావనం అంతా పులకితమై, కృష్ణానంద మయమై కనిపించింది.
No comments:
Post a Comment