Monday, 19 March 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 13 - 15 (with Audio)


1-13
శ్లోకం
ప్రణయపరిణతాభ్యాం శ్రీభరాలంబనాభ్యాం
ప్రతిపదలలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యామ్
ప్రతిముహు రధికాభ్యాం ప్రస్ఫురల్లోచనాభ్యాం
ప్రవహతు హృదయే నః ప్రాణనాధః  కిశోరః




గోపాలకృష్ణుని కళ్ళు  శృంగారవిషయంలో అన్ని రకాలైన అందాలనూ తమలో నింపుకుని పరిపూర్ణ సౌందర్యభరితాలై ఉన్నాయి. ఆ కళ్ళు అణువణువునా సౌకుమార్యాన్ని నింపుకుని    క్షణక్షణానికీ పెరుగుతున్న నూతనశోభతో ప్రకాశిస్తున్నాయి. అటువంటి అందమైన కళ్ళున్న బాలగోపాలుడు నా హృదయంలో అమృతమూర్తిగా నిలవాలని కోరుతున్నాను.
  
1-14
శ్లోకం
మాధుర్యవారిధి మదాంబుతరంగభంగీ
శృంగార సంకులిత శీత కిశోర వేషమ్
ఆమందహాస లలితాననచంద్రబింబ
మానందసంప్లవ మనుప్లవతాం మనో మే




 నా ఎదురుగా విశిష్టమైన ఆనందప్రవాహరూపంలో ఒకపసివాని రూపం కనిపిస్తున్నది. మాధుర్యమనే మహాసముద్రంలోనుంచి వచ్చే పారవశ్యమనే అలలవంటి శృంగారరసాన్ని ఆ పసివాడు తనలో ఇముడ్చుకున్నాడు. చిరునవ్వు అనే వెన్నెలతో మెరిసిపోయే చంద్రబింబం లాంటి ఆ ముఖం కలిగించే ఆనందపుపొంగులో నిరంతరమూ మునిగి ఉండాలని  నేను కోరుకుంటున్నాను.

 1-15
శ్లోకం
అవ్యాజమంజులముఖామ్బుజముగ్ధభావై
రాస్వాద్యమాన నిజవేణువినోదనాదమ్
ఆక్రీడతా మరుణపాద సరోరుహాభ్యా
మార్ద్రే మదీయహృదయే భువనార్ద్రమోజః  



బాలగోపాలుని పద్మం లాంటి ముఖం, లోకంలోని ఇతర పదార్ధాలన్నిటికంటే తేజోవంతమైనది. భావుకులకి ఆ ముఖంలో ఎన్నో భావాలు అనుభవగోచరాలవుతాయి.తాను సృష్టించే మురళీనాదాన్ని అనుభవించటంలోని మాధుర్యం ఆయన ముఖంలో కనిపిస్తుంటుంది. ఆ దివ్యతేజం యొక్క సౌందర్యాన్ని ఆరాధించటంతో ఆర్ద్రమైన నా హృదయంలో ఆ బాలగోపాలుడు తన ఎర్రని లేత పాదాలతో ఆదుకోవాలని కోరుతున్నాను.

No comments:

Post a Comment